మీ పల్లెను మాట్లాడుతున్నా.. | - | Sakshi
Sakshi News home page

మీ పల్లెను మాట్లాడుతున్నా..

Dec 11 2025 9:25 AM | Updated on Dec 11 2025 9:25 AM

మీ పల్లెను మాట్లాడుతున్నా..

మీ పల్లెను మాట్లాడుతున్నా..

సిరిసిల్ల: అప్పుడే తెల్లారుతోంది. మంచుతెరలు కమ్ముకున్నాయి. సూర్యుడి లేలేత కిరణాలు పల్లెముంగిలికి చేరుతున్నాయి. ఈరోజు ఓట్ల పండగ. ఈ ఒక్క రోజు నువ్వే రారాజువి. పోటీ చేసిన అభ్యర్థులంతా నీ చుట్టూ చేరి చేతులు జోడించి ఓట్లు అడుగుతున్నారు. ఐదేళ్లకోసారి వచ్చే అరుదైన అవకాశం ఇది. బయలుదేరు.. ఓటు అస్త్రాన్ని సంధించు. ఊరికి ఉపకారం చేసే అభ్యర్థిని సర్పంచిగా గెలిపించు. వంగి వంగి దండాలు పెట్టిన అభ్యర్థులంతా మట్టి కరువాలి. మన తలరాతలను మార్చే మంచోడికి ఓటేయ్యి. ఎన్నికల రోజు కాబట్టి నా మనసు ఊరుకో లేక.. మీకో లేఖ రాస్తున్నా..!

ఊరుకు సర్పంచే సుప్రీం

ఒక్కసారి ఆలోచించండి. ఊరికి సర్పంచే సుప్రీం. పల్లె మారాలి.. ప్రగతి పల్లవించాలంటే మీ ఓటుతోనే సాధ్యం. సర్పంచిగా పోటీచేసిన అభ్యర్థులు చెప్పే మాయమాటలు నమ్మకండి. అరచేతిలో వైకుంఠం.. చూపించే మాటల గారడి అభ్యర్థుల సంగతి చూడండి. ఐదు వందలకో, వెయ్యికో, రెండు వేలకో.. మద్యం సీసాకో, ఓ చీరకో ఓటును అమ్మకండి.

ఆ నవ్వు వెనక నయవంచనను గుర్తించండి

గతంలో ఏం జరిగిందో ఆలోచించండి. ‘నమ్మి నానబోస్తే.. పుచ్చి బుర్రలు అయినట్లు.’ మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు.. వాళ్లు అబద్ధపు హామీలు ఇస్తూనే ఉన్నారు. ఏవేవో ఇస్తామని ఆశలు పెడుతుండ్రు. కులం, మతం, వాడకట్టు పాటలు పాడి మీ ముందుకొచ్చిన నేతల అసలు రూపం ఏంటో నా కంటే మీకే ఎక్కువ తెలుసు. ఆ నవ్వు వెనక ఉన్న నయవంచనను గుర్తించండి. ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి. ఎన్నెన్నో చెప్పి గెలిచాక ఊరి అభివృద్ధిని మరిచి గ్రామసభలు పెట్టకుండా.. సమస్యల ప్రాధాన్యతను గుర్తించకుండా.. ప్రజల బాధలను పట్టించుకోకుండా కాంట్రాక్టులు చేసి సంపాదించుకునే వారిని, కమీషన్లు దండుకునే వారిని ఎన్నుకోవాలా? ఏదైనా పని పడి వెళ్తే ఇంటి గేటవుతల నిలబెట్టే వారిని గెలిపించాలా? ఇకనైన కళ్లు తెరవండి. దండం పెట్టాడని ఓటేస్తే... మళ్లీ ఓట్ల సీజన్‌ దాకా కనిపించడు.

ఆత్మసాక్షిగా ఓటేయండి

మీకు అందుబాటులో ఉండి సేవ చేసే నిస్వార్థ నాయకున్ని ఎన్నుకోండి. ఆత్మసాక్షిగా ఓటేయండి. గతంలో ఊరి సర్పంచులుగా ఎన్నికై న వారు ఏం చేశారో ఆలోచించండి. అందుకే ఎన్నికల వేళ మీ అందరికీ ఓ విన్నపం. మీకు మంచి పనులు చేసే సర్పంచిని, వార్డు సభ్యులనే ఎన్నుకోండి. మీకు మేలు చేసే వారిని మరవద్దు. తెలంగాణలో ఓ సామెత ఉంది. కళ్ల ముందు కనిపించే కూట్లో రాయి తీయనోడు.. ‘ఎక్కడో ఉండే ఏట్లో రాయి తీస్తడా..’ అని. ఇవన్నీ మీకు తెలియనివి కావు. కానీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ‘తిన్న రేవును తలవాలంటారు’ అందుకే చెబుతున్నా. మీకు మంచి చేసిన వారిని విస్మరించొద్దు. కులమనో.. ప్రాంతమనో... ఓటు వేస్తే ఫలితం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఊరందరి సమస్యలను తనవిగా భావించే వారినే ఎన్నుకోండి. గతంలో సర్పంచులుగా పనిచేసిన వారు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను దిగమించిన సంగతి మీకు తెలుసు. పింఛన్‌ కోసం వెళ్తే పైసలు గుంజిన సంగతి ఎరుకే. అన్నింటికి మించి తాగేందుకు నీరు ఇవ్వని వారు.. ఒక్క వీధిదీపమైనా పెట్టని వారు.. ఎందరో ఉన్నారు.

సహజ సంపదను దోచెటోళ్లు

వాగు ఇసుకను, గుట్టల రాళ్లను, మొరం, అడవులను దోచి, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి సంపాదించినోళ్లూ ఉన్నారు. మీ క్షేమం.. నా సంక్షేమాన్ని చూసుకునే మంచి వారు అందలమెక్కాలి. ఇక లెవ్వు.. చలి కాలమని.. పనికాలమని ఓటు వేయకుండా.. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లకుండా ఉండొద్దు. మీ ఓటే వజ్రాయుధం. నీతివంతులకు పట్టం కడితే... మీ ఊరూ, వాడ బాగవుతుంది. అవినీతిపరులను, డబ్బులిచ్చినోడికి ఓటేస్తే ఇక ఐదేండ్లు అతడి అవినీతికి లైసెన్సిచ్చినట్లవుతుంది. ఇంకో మాట ఈ రోజు పోలింగ్‌ పగలు ఒంటిగంట వరకు ఉంటది. ఈలోగా నువ్వు పోలింగ్‌ కేంద్రానికి వెళ్తేనే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఆలస్యమైతే అంతే.. సంగతి.. ఇంకో మాట ఈ సారి రెండు ఓట్లు ఉంటయి. బ్యాలెట్‌ పత్రాలు రెండు ఇస్తారు. ఒక్క గులాబి రంగు సర్పంచి ఓటు.. ఇంకోటి తెల్లరంగు పత్రం వార్డు సభ్యుడి ఓటు సరిగ్గా గుర్తును చూసి ఓటేయండి..

మీ బాగోగులు చూసుకునే ఆత్మీయుడికి పట్టం కట్టండి. మీ అంతరాత్మ ‘సాక్షి’గా ఓటు వేయండి. ఇంతసేపు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నా మొర ఆలకించినందుకు మీ అందరికీ నా దండాలు.. ఇక ఉంటాను.

ఇట్లు

మీ అందరి సంక్షేమాన్ని కోరే

మీ పల్లె తల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement