అప్పుడు నో.. ఇప్పుడు సై..
● 2019లో ఎన్నికలను బహిష్కరించిన గొల్లపల్లి గ్రామస్తులు
ఇల్లంతకుంట(మానకొండూర్): తమ గ్రామ ఓట్లు తమ గ్రామం నుంచి విడిపోయి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీలో కలవడాన్ని నిరసిస్తూ.. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను గొల్లపల్లి గ్రామస్తులు బహిష్కరించారు. అదే సంవత్సరం మూడు నెలల తర్వాత మళ్లీ గొల్లపల్లి గ్రామానికి రీనోటిఫికేషన్ వేశారు. సర్పంచ్, వార్డులకు నామినేషన్లు అభ్యర్థులు వేశారు. తీరా ఓటర్ లిస్టు పరిశీలించగా.. తమ గ్రామం నుంచి విడిపోయిన 148 ఓట్లు కలవకపోవడంతో మళ్లీ బహిష్కరించారు. గ్రామ పరిపాలన అప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్‌చార్జి అధికారులే నిర్వహిస్తూ వచ్చారు. సంవత్సర క్రితం జరిగిన రీసర్వేలో తమ గ్రామ ఓట్లు 150, సరిహద్దులు తమ గ్రామంలో మళ్లీ కలవడంతో.. ఆరేళ్ల అనంతరం తిరిగి ఈసారి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పాల్గొంటున్నారు. గ్రామంలో 620 ఓటర్లున్నారు. 8 వార్డులుండగా.. మూడు, నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళ రిజర్వేషన్ కాగా.. రడం లక్ష్మి, కడగండ్ల శిరీష పోటీ చేస్తున్నారు. శిరీష అంగన్వాడీ ఆయా పోస్టుకు రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలబడ్డారు.


