ఊరు రమ్మంటోంది..
ఎవరెవరు ఎక్కడెక్కడ?
తొలి విడత పోలింగ్: ఈనెల 11(నేడే) పోలింగ్ జరిగే సమయం: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం: అదే రోజు
● సమగ్ర కుటుంబ సర్వేను మరిపించమంటోంది.. ● ఒక్క ఓటూ కీలకమే..
● శత శాతం ఓటింగ్‌తోనే ప్రజాస్వామ్యం ● నచ్చకుంటే ‘నోటా’ ఉందిగా..
కరీంనగర్ అర్బన్: దసరా వచ్చిందంటే.. రెక్కలు కట్టుకొని సొంతూళ్లో వాలిపోతాం. సంక్రాంతి ఇంకా నెల ఉందనగానే పుట్టిన పల్లెకు పోవడానికి ముందే టికెట్లు బుక్ చేసుకుంటాం. ఏడాదిలో వచ్చే అనేక వేడుకలు, శుభకార్యాలకు గ్రామానికి వస్తాం. బంధువులను పలకరించి.. అయినవాళ్లతో హాయిగా గడిపి మళ్లీ వెళ్లిపోతాం. మరి ఈనెల 11, 14, 17 తేదీల్లో మీమీ జన్మస్థలాల్లో గొప్ప కార్యం జరగబోతోంది. దానికి అందరూ తప్పకుండా రావాలని ఊరు పిలుస్తోంది. ఓటు తలస్తోంది. అదే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వజ్రాయుధం. మిగతా సంబురాల్లాగానే దీనికి తప్పకుండా వచ్చి ఓటేసి సొంత గడ్డపై ఒకరోజు హాయిగా సేదదీరి వెళ్లాలని కోరుతోంది. ఓటేసి పొమ్మంటోంది.
● ఒక్క ఓటూ కీలకమే..
దేశ, రాష్ట్రంలోనే కాదు.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఒక్క ఓటు కీలకమైంది. అందుకు గత ఎన్నికలే నిదర్శనం. గంగాధర మండలం మల్లాపూర్‌లో కిషన్, అంజయ్య పోటీ పడగా.. ఇద్దరికి 471 ఓట్లు సమానంగా వచ్చాయి. అధికారులు డ్రా తీసి అంజయ్యను సర్పంచ్‌గా ప్రకటించారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో కల్పన, మాధవి పోటీ పడగా.. ఇద్దరికి 1,250 ఓట్లు వచ్చాయి. అధికారులు మూడుసార్లు ఓట్లను లెక్కించినా.. అదే ఫలితం రావడంతో టాస్ వేసి కల్పనను విజేతగా ప్రకటించారు. జిల్లాలో 318 గ్రామాలకు గానూ 316 గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పావువంతు గ్రామాల్లో నువ్వానేనా అన్నట్లుగా పోటీ ఉంది. ఈక్రమంలో ఒక్క ఓటూ ఫలితాన్ని మార్చనుంది.
● పలు రాష్ట్రాల్లో ఓటర్లు
జిల్లాలోని చాలామంది విద్య, వ్యాపారం, ఉపాధిరీత్యా దేశం నలుమూలలా ఉంటున్నారు. ఉద్యోగులు బదిలీపై పొరుగు జిల్లాలకు వెళ్లి నివసిస్తున్నారు. చేనేత కార్మికులు వేల సంఖ్యలో పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు. ఇలా అనేక వర్గాల ప్రజలు మరోచోట ఉన్నా.. ఓటు మాత్రం సొంతూళ్లోనే ఉంది. ఇతర రాష్ట్రాల్లోని వారు ఒకరోజు సెలవు పెట్టుకొని వస్తే ఓటేయొచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులను చూడొచ్చు. పలకరించొచ్చు. ఉత్సవాలను ఆత్మీయుల మధ్య చేసుకొని ఓ ప్రజాస్వామ్య పండగ్గా భావించి పోలింగ్ రోజును ఘనంగా నిర్వహించుకోండి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సకల సౌకరా్యాలు కల్పిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుండగా.. ఒకరోజు ముందే వస్తే మంచిది.
● యాది చేసుకోండి..
రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. అప్పుడు బయట ఉండేవారంతా రెక్కలు కట్టుకొని వచ్చి వాలారు. అలాగే ఓటు వేడుకకూ తరలొచ్చి నచ్చిన వారికి ఓటేసి వెళ్తే ప్రజా స్వామ్య యజ్ఞంలో పాలుపంచుకున్న తృప్తి ఉంటుంది. నాకెందుకులే అనుకోవద్దు. నీ ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయించొచ్చు. కీలకంగా మా రొచ్చు. మీరు ఎన్నుకున్న వ్యక్తి వల్ల ఊరు బాగు ప డిందంటే అభివద్ధిలో మీ భాగస్వామ్యం ఉన్నట్టేగా.
● ప్రలోభాలకు లొంగొద్దు
ఇప్పుడు పలు రాజకీయ పార్టీలు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లపై దృష్టి పెట్టాయి. ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి బూత్ కమిటీలతో ఆరా తీసి ఇప్పటికే ఫోన్లు చేశారు. దారి ఖర్చులతోపాటు ఇతర ఖర్చులను భరిస్తామని ప్రలోభపెడుతున్నారని సమాచారం. పోలింగ్ తేదీన రప్పించడానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఎవరి మాటలూ నమ్మకుండా స్వేచ్ఛగా ఓటెయ్యండి.
విద్యార్థులు: ఢిల్లీ, చైన్నె, హైదరాబాద్, కర్నాటక, పంజాబ్
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు: బెంగళూరు, హైదరాబాద్, చైన్నె, తిరువనంతపురం, ముంబయి, ఢిల్లీ
చేనేతలు: సూరత్, భీవండి, అహ్మదాబాద్, ముంబయి
ఉద్యోగులు: కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి
వ్యాపారులు: హైదరాబాద్‌తోపాటు అనేక జిల్లాలు, ఇతర రాష్ట్రాలు
కార్మికులు: ముంబయి, హైదరాబాద్


