మెడికల్ రిప్ ఆత్మహత్య
● వెంటాడిన బట్టల షాపు అప్పులు
● వడ్డీలు కట్టలేక మనస్తాపం
చొప్పదండి: పట్టణంలోని మసీద్ రోడ్డుకు చెందిన కటుకం శరత్‌చంద్ర(39) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. చొప్పదండికి చెందిన సత్యనారాయణ కుమారుడు శరత్‌చంద్రకు దివ్యతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. నాలుగేళ్లుగా కుటుంబంతో కరీంనగర్‌లో కిరాయికుంటున్న శరత్ మెడికల్ రిప్‌గా పని చేస్తున్నాడు. శరత్ తల్లిదండ్రులు కూడా కరీంనగర్‌లోనే నివాసముంటున్నారు. గతంలో కరీంనగర్‌లోని విద్యానగర్‌లో బట్టల షాపు పెట్టి శరత్ నష్టపోయాడు. అప్పుల బారిన పడ్డాడు. లోన్ యాప్స్, ముత్తూట్ ఫైనాన్స్ ద్వారా బంగారం కుదువబెట్టి అప్పులు చేశాడు. మెడికల్ రిప్‌గా పని చేస్తూ మిత్తీలు కూడా కట్టకపోవడంతో ప్రస్తుత సంపాదనతో అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకపోతున్నానని చెప్పేవాడు. ఈనెల 9న డ్యూటీ మీద హుజూరాబాద్ వెళ్తున్నానని చెప్పి శరత్ వెళ్లిపోయాడు. ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేసినా కలవకపోవడంతో బుధవారం చొప్పదండిలోని మృతుడి స్నేహితులకు శరత్ భార్య దివ్య ఫోన్ చేసి ఇంటికెళ్లి చూడాలని చెప్పింది. అప్పుల బాధకు మనస్తాపం చెందిన శరత్ మంగళవారం రాత్రి చొప్పదండికి చేరుకొని ఉరేసుకున్నాడు. చొప్పదండిలోని ఇంటికి వచ్చి స్నేహితులు చూసేసరికి మృతిచెంది కనిపించాడు. మృతుడి భార్యకు సమాచారమందించారు. శరత్ సూసైడ్ నోట్ రాసి చనిపోగా.. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేశ్‌రెడ్డి తెలిపారు.


