టార్గెట్.. 100శాతం పోలింగ్
కరీంనగర్ అర్బన్: ప్రజాస్వామ్యంలో ఓటర్ల నిర్ణయమే అంతిమం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం (సీఈసీ) అవగాహన కల్పిస్తోంది. ఓటరు చైతన్యమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. గత ఎన్నికల్లో తక్కువశాతం పోలింగ్ నమోదైన గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూనే అన్ని గ్రామాల్లో సాంస్కృతిక సారథి కళాకారులను ప్రచారం చేయాలని ఆదేశించింది. డీపీఆర్వో లక్ష్మణ్ పర్యవేక్షణలో 30 మంది కళాకారులుండగా రెండు బృందాలుగా విభజించారు. ఝాన్సీ, వడ్లకొండ అనిల్ ఆయా బృందాలకు నేతృత్వం వహిస్తుండగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా షెడ్యూల్ ప్రకారం ప్రచారానికి పదును పెట్టారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేలా పాటలతో చైతన్యం కల్పిస్తున్నారు. ఎన్నికల్లో బెదిరింపులకు గురిచేసినా, ప్రలోభపెట్టినా ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎలా ఫిర్యాదు చేయాలి వంటి అంశాలను వివరిస్తున్నారు. ప్రతి రోజు నిర్దేశిత గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా రోజువారీ కార్యక్రమాల వివరాలను ఫొటోలు తీసి డీపీఆర్వోకు చేరవేస్తున్నారు.


