ఏడు బృందాల నిఘా !
సిరిసిల్ల: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగిసిపోనుండగా ఎన్నికలు డిసెంబరు 11న జరుగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇదే సమయంలో ఎన్నికలపై అధికారులు నిఘా పటిష్టం చేశారు. ఏడు విభాగాలతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేస్తున్నారు.
ఫ్ల్లయింగ్ స్క్వాడ్
మండల కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీం(ఎఫ్‌ఎస్‌టీ) ఉంటుంది. ఎన్నికలు ముగిసే వరకు ఈ బృందం గ్రామాల్లో సంచరిస్తుంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులకు స్పందించి క్షేత్రస్థాయికి చేరుకోవాల్సి ఉంటుంది. బెదిరింపులు, మద్యం, డబ్బుల పంపిణీ ఫిర్యాదులపై స్పందిస్తుంది. ఎన్నికల ఖర్చుపై వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటుంది. బహిరంగ సభలు, ర్యాలీలను చిత్రీకరిస్తుంది. మద్యం, డబ్బు పంపిణీపై సాక్షుల సమక్షంలో జప్తు చేస్తుంది. రూ.50వేలకు మించి నగదును ఎవరూ కలిగి ఉన్న సీజ్ చేస్తుంది. అభ్యర్థి పార్టీ కార్యకర్తగా భావిస్తే ఎఫ్‌ఐఆర్ నమోదును సిఫార్సు చేస్తుంది. సాధారణ వ్యక్తులు రూ.50వేలకు మించి ఉంటే ఆ డబ్బుకు ఆధారాలుంటే వదిలేస్తుంది. లేకుంటే సీజ్ చేసి రశీదు అందిస్తారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా డీటీవో వద్ద జమచేస్తుంది. ఎవరైనా నగదు రూ.10లక్షలు కలిగి ఉంటే ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తుంది.
స్టాటిక్ సర్వేలెన్స్ టీం(ఎస్‌ఎస్‌టీ)
జిల్లా సరిహద్దుల్లో స్టాటిక్ సర్వేలెన్స్ టీం(ఎస్‌ఎస్‌టీ) చెక్‌పోస్టులను పర్యవేక్షిస్తుంది. అక్రమ మద్యం, పెద్దమొత్తంలో డబ్బు, ఆయుధాల రవా ణాపై చర్యలు తీసుకుంటుంది. పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన వాహనాలు, డబ్బు, మద్యం పట్టుబడితే వీడియో తీయించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తుంది. ఎస్‌ఎస్‌టీ బృందం ఎన్నికల కమిషన్ ద్వారా నియమితమవుతుంది. మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వీడియోగ్రాఫర్ ద్వారా ఎస్‌ఎస్‌టీ పనిచేయాలి.
వీడియో సర్వేలెన్స్ టీం(వీఎస్‌టీ)
వీడియో సర్వేలెన్స్ టీం(వీఎస్‌టీ) మండల కేంద్రాల్లో ఉంటుంది. ఎన్నికల ఖర్చు, వివిధ సందర్భాల్లో వీడియో చిత్రీకరిస్తుంది. వీడియో రికార్డు చేసేటప్పుడు వాయిస్ మోడ్‌లో టైటిల్ స్థలం, పార్టీ పేరు, ప్రచారం నిర్వహించే అభ్యర్థి పేరు వీడియో రికార్డు చేయాలి. సమావేశాలు, సభలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పోస్టర్ సైజులు, బ్యానర్లు, లౌడ్‌స్పీకర్లు వీడియో రికార్డు చేస్తారు. వాహన డ్రైవర్ల స్టేట్‌మెంట్ నమోదు చేయాలి.
వీడియో వ్యూయింగ్ టీం(వీవీటీ)
మండల కేంద్రాల్లో వీడీయో వ్యూయింగ్ టీం(వీవీటీ) ఉంటుంది. ఎన్నికల ఖర్చుపై రోజువారీ వీడియోలను, సీడీలను ఈ టీమ్ చూస్తుంది. వీఎస్‌టీ సమర్పించిన సీడీలను, వీడీయోలను, మెమొరీకార్డులను బయటి ఏజెన్సీలకు ఇవ్వకూడదు. ఎన్నికల ఖర్చుపై నివేదికను ఏ రోజుకారోజు ఏఈవోకు సమర్పించాలి. వీవీటీ సమర్పించే రిపోర్టులో వాహనం నంబర్లు, వేదిక, కుర్చీల సంఖ్య, బ్యానర్‌సైజు, సమగ్ర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వీటిని ఎన్నికల పరిశీలకులకు అందించాలి. ఎన్నికల్లో అభ్యర్థి చేసే ఖర్చుకు సంబంధించి హెచ్చుతగ్గులున్నట్లు భావిస్తే వీవీటీ బృందం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి 24 గంటల్లో రాతపూర్వకంగా అందించాలి. సమగ్ర సాక్ష్యాధారాలతో అందించాల్సి ఉంటుంది.
మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ)
మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) జిల్లా స్థాయిలో ఉంటుంది. ప్రింటు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వచ్చే అభ్యర్థుల ప్రచారాల క్లిప్పింగ్స్‌ను ఎంసీఎంసీ కమిటీ సేకరించాలి. వీటిని అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగా నమోదు చేయాలి. పత్రికలకు, టీవీలకు ఇచ్చే ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ అనుమతి తప్పనిసరి. ఎన్నికల్లో అభ్యర్థుల పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేసే ప్రచురణకర్త పేరు, ప్రతులసంఖ్య స్పష్టంగా ఉండాలి. లేకుంటే అభ్యర్థికి నోటీసు ఇవ్వాలి. ఎంసీఎంసీ కమిటీ పెయిడ్ న్యూస్‌ను గుర్తించి నివేదిక సమర్పిస్తుంది.
అకౌంటింగ్ టీం(ఏటీ)
ప్రతీ మండల కేంద్రంలో ఏఈవో సహాయకులు ఉంటారు. షాడో అబ్జర్వేషన్ విధిగా ఎన్నికల లెక్కలను నమోదు చేస్తుంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు మూడుసార్లు లెక్కలు సమర్పించాలి. షాడో బృందాలు అభ్యర్థులు సమర్పించిన లెక్కలతో సరి పోల్చుతారు. హెచ్చుతగ్గులుంటే నోటీసులిస్తారు. అభ్యర్థులు నామినేషన్ నుంచి ఎన్నికలు ముగిసే వరకు చేసే ఖర్చును, వాటికి సంబంధించిన ఆధారాలను నమోదు చేస్తారు. ప్రత్యేక రిజిస్టర్‌లో వీటిని పొందుపరుస్తారు. లెక్కల వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుంది.
అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్(ఏఈవో)
ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ఈ బృందం పనిచేస్తుంది. జిల్లా నోడల్ అధికారికి నిత్యం ఏఈవో బృందం నివేదిక సమర్పిస్తుంది. గ్రామాల్లో అభ్యర్థులు చేసే ఖర్చు వివరాల గురించి నివేదిస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌తోపాటు ఇతర విభాగాలు అందించే నివేదికలను క్రోఢీకరించి జిల్లా ఎన్నికల అధికారికి అందిస్తారు. వీఎస్‌టీ, వీవీటీ, ఎంసీఎంసీ కమిటీ ఎన్నికల ఖర్చుల వివరాలను క్రోఢీకరించి రోజువారీగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగిసే వరకు ఈ విభాగం పనిచేస్తుంది. కాల్ సెంటర్ ఫిర్యాదులపై నివేదిక అందిస్తుంది.
గ్రామ‘పంచాయతీ’ల్లో మూడో కన్ను
పంచాయతీ ఎన్నికల్లో ప్రవర్తన నియమావళి
మూడు విడతల ఎన్నికలపైనా నిఘా బృందాలు


