సాంబార్ గిన్నెలో పడి బాలుడి మృతి
● పుట్టినరోజునే మృత్యు ఒడిలోకి
● వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి
ధర్మారం: పెద్దపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. తన బర్త్‌డే నాడే నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు సాంబార్ గిన్నెలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పుట్టినరోజు వేడుక జరిపేందుకు తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్న తరుణంలో కుమారుడు కానరాని లోకాలకు వెళ్లడం పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. ధర్మారం ఎస్సై ప్రవీణ్కుమార్, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన మొగిలి మధుకర్ ఏడాదిన్నరగా మల్లాపూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకులంలో తాత్కాలిక పద్ధతిన వంటమనిషిగా పనిచేస్తున్నాడు. మధుకర్ భార్య శారద, కూతురు శ్రీమహి(8), కుమారుడు మోక్షిత్(4)తో కలిసి విద్యాలయంలోని ఓ గదిలో నివాసం ఉంటున్నారు. రోజూ మాదిరిగానే ఆదివారం వంటగదిలో మధుకర్ వంట తయారుచేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. కాసేపటికి సాంబారు వండి పక్కన పెట్టాడు. అతడి కుమారుడు మోక్షిత్ ఆడుకుంటూ వంట గదిలోకి వెళ్లాడు. అకస్మాత్తుగా వేడి సాంబారు పాత్రలో పడిపోయాడు. వేడితీవ్రతకు గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన తండ్రి మధుకర్.. తొలుత కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం బాలుడు మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. బర్త్‌డే రోజే తమ కుమారుడు కళ్లెదుటే గాయపడి మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బంధువులు రోదించిన తీరు కలచివేఇంది.
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఎర్రోజు దేవేందర్(53) సోమవారం గుండెపోటుతో మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. దేవేందర్ నగరంలోని గాంధీచౌరస్తాలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విధులు నిర్వహించాడు. ఇంటికి వెళ్లి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. 1992లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పోలీసుశాఖలో చేరిన దేవేందర్, ప్రస్తుతం సివిల్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా కొనసాగుతున్నాడు. భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈ ఘటనపై సీపీ గౌస్‌ఆలం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
చికిత్స పొందుతూ యువకుడు మృతి
వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు(27) చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం... ఆంజనేయులు నవంబర్ 30న రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. ఎందుకు తాగొచ్చావని తండ్రి శంకరయ్య మందలించాడు. మనస్తాపానికి గురైన ఆంజనేయులు పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తల్లి విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు.
బావిలో పడి రైతు మృతి
రామడుగు: రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామానికి చెందిన జాడి రాములు(48) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై కె. రాజు తెలిపారు. జాడి రాములు ఆదివారం మేకను తీసుకొని పొలం వద్దకు వెళ్లాడు. మేక ప్రమాదశాత్తు బావిలో పడిపోగా కాపాడేందుకు ప్రయత్నించి, రాములు నీటమునిగి చనిపోయాడు. మృతుని భార్య జమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
వీధి కుక్కల బెడదపై హైకోర్టులో విచారణ
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో వీధి కుక్కల బెడదపై హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపారు. ప్రతివాదిగా ఉన్న మున్సిపల్ కమిషనర్‌కు కౌంటర్ దాఖలు చేయాలని న్యూయమూర్తి సూచించారు. కేసు విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేశారు. ఈవిషయాన్ని మంథనికి చెందిన పిటిషనర్, హైకోర్టు న్యాయవాది ఇనుముల సతీశ్ సోమవారం తెలిపారు. మంథనిలోని పలు వార్డుల్లో వీధికుక్కలు సైరవిహారం చేస్తున్నాయని, రాత్రంతా మొరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా దారిన వెళ్తున్న వారిని కరుస్తూ ఆందోళన గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.ఈ విషయంపై ఇటీవల 7వ వార్డులో కుక్కకాటుకు గురైన కొల్లూరి సమ్మయ్యతో కలిసి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు సతీశ్ వివరించారు.
సాంబార్ గిన్నెలో పడి బాలుడి మృతి


