చైనా ‘మాంజా’ తగిలి కాలికి గాయం
పెద్దపల్లిరూరల్: గాలిపటం ఎగురవేసేందుకు దారమే ఆధారం.. కానీ, ఆ దారంతో మరో పతంగిని కోసేందుకు పోటీపడుతున్నారు. ప్రమాదకర రసాయనాలతో (సింథటిక్ గాజు పూసిన దారం) తయారు చేసిన చైనాను వినియోగిస్తున్నారు. మనదేశంలో నిషేధిత చైనా మాంజాను వినియోగించి ప్రాణాల మీదికి తెస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాగర్‌రోడ్డు ప్రాంతంలో నివాసముండే తిర్రి సక్కుబాయి సోమవారం బ్యాంకులో పింఛన్ డబ్బు తెచ్చుకునేందుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తోంది. ఆ క్రమంలో ఎల్లమ్మచెరువు ప్రాంతంలో ఓ గాలిపటం తెగి దారం కిందపడగా.. తెంపిన యువకులు లాగుతున్న దారం సక్కుబాయి కాలికి చుట్టుకుని కాలివేళ్లు తెగి రక్తస్రావమైంది. ఆ దారాన్ని తొలగించే యత్నంలో చేతికి కూడా స్వల్పగాయమైంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. దారానికి గాజు లోహపు పొడి ఉండడంతో సెప్టిక్ అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. కాలికి తగిలింది.. అదే దారం మెడకు తగిలితే పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు చొరవచూపి ప్రమాదకర చైనా మాంజా అమ్మకాలను నియంత్రించి విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని సక్కుబాయి కుమారుడు తిర్రి రవీందర్ కోరారు.
కనిపించని మాంజా క్రయ, విక్రయాలపై నిషేధం ఏది?


