చేతులు కలిపితే ఉద్యోగం పోయినట్టే !
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్నికల జరిగే సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుంది. దీని ఉదేశం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్లు లెక్క. అయితే కొందరు ఉద్యోగులు తెలియని తనం, అత్యుత్సాహంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో కరచాలనం చేయడం, సన్నిహితంగా ఉండడం చేస్తుంటారు. ఇదీ చాలా పెద్ద తప్పని ఎన్నికల సంఘం చెబుతోంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊడిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తోంది.
కరచాలనం ఎందుకు చేయకూడదు?
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం కింద పనిచేస్తారు. ఉద్యోగులు ఒక అభ్యర్థికి బహిరంగంగా కరచాలనం చేయడం, సన్నిహితంగా ఉండడం ద్వారా ఆ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారనే లేదా అనుకూలంగా ఉన్నారనే భావన ప్రజల్లో కలుగుతుంది. దీంతో ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత సన్నగిల్లే అవకాశం ఉంది.
ప్రవర్తనా నియమావళి
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత.. ప్రవర్తన నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులోకి వస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వ అధికారులు ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులతో, రాజకీయ పార్టీల ప్రతినిధులతో అనవసరమైన సాన్నిహిత్యాన్ని ప్రదర్శించకూడదు.
పరిధి దాటితే శిక్ష తప్పదు
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే శిక్షలు తప్పవు. క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనల ఉల్లంఘన తీవ్రతను బట్టి సర్వీస్ రూల్స్ ప్రకారం శాఖాపరమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వేతన పెరుగుదల నిలిపివేయడం, పదోన్నతి నిలిపివేయడం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం నుంచి తొలగించడం, నిర్బంధ పదవీ విరమణ చేయించడం జరుగుతుంది. అధికారి ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే కేసులు నమోదుచేసి జైలుకు పంపే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జరిమానాలు విధిస్తారు.
ఎన్నికల సమయాల్లో కఠిన నిబంధనలు
నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు


