రాత్రికి రాత్రే గుర్తులు మార్చేశారు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్నికల గుర్తులు కేటాయించి అధికారికంగా ప్రకటించిన తర్వాత రాత్రికి రాత్రే గుర్తులు మార్చేసిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మేజర్ గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. బాధిత సర్పంచ్ అభ్యర్థి అంకారపు రవీందర్ ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. శనివారం సాయంత్రం రిటర్నింగ్ అధికారి తనకు ఉంగరం గుర్తు కేటాయించి, పంచాయతీ కార్యాలయంలోనూ అతికించారని తెలిపారు. దీంతో తాను ప్రచారం ప్రారంభించగా రాత్రికి రాత్రే గుర్తును మార్చేశారని ఆదివారం ఉదయం చూస్తే ఉంగరం గుర్తుకు బదులుగా కత్తెరను కేటాయించారని వాపోయారు. తన ప్రత్యుర్థులు అధికార పార్టీకి చెందిన వారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనను ఓడించాలని కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మండల ఎన్నికల అధికారులను వివరణ కోరగా రాష్ట్ర ఎన్నికల అధికారుల ఆదేశాలు, జిల్లా ఎన్నికల అధికారుల సూచనలతో నిబంధనల ప్రకారం గుర్తులను మార్చినట్లు తెలిపారు.
రిటర్నింగ్ అధికారుల తీరుపై సర్పంచ్ అభ్యర్థి నిరసన
తంగళ్లపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో వింత ఘటన


