ప్రచార వాహనాలకు అనుమతుల తిప్పలు
కరీంనగర్‌రూరల్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నవారు ప్రచార అనుమతులు పొందడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటి విడత ప్రచారానికి ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉండగా పోలీస్, రెవెన్యూశాఖల నుంచి సకాలంలో ప్రచార వాహనాలకు అనుమతులు లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, గంగాధర, రామడుగు, చొప్పదండిలో మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న జరగనున్నాయి. సర్పంచ్ 463, వార్డు సభ్యులకు 1,939 మంది బరిలో ఉన్నారు. ఇప్పటికే గుర్తులు కేటాయించగా.. వాహనాల ద్వారా గ్రామాల్లో విస్తతంగా ప్రచారం చేయాలని భావించిన అభ్యర్థులకు వాహనాలు, మైక్‌లకు అనుమతులు పొందడం కత్తిమీద సాములా మారింది. రెవెన్యూశాఖ ఆద్వర్యంలో మ్యాన్యువల్ పద్ధతిలో వాహన అనుమతి జారీ చేస్తున్నారు. పోలీస్‌శాఖ నుంచి మైక్ అనుమతిని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఏసీపీస్థాయి అధికారి మంజూరు చేస్తున్నారు. శుక్రవారం రెవెన్యూశాఖ నుంచి వాహనాలకు అనుమతి పొందిన పలువురు అభ్యర్థులు మీసేవా, ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా మైక్ అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా సాంకేతిక సమస్య ఏర్పడింది. ఆన్‌లైన్‌లో అభ్యర్థుల వివరాలను నమోదు చేయగా.. ఎర్రర్ డిటెయిల్స్ అని రావడంతో మైక్ అనుమతి లభించలేదు. పలువురు అభ్యర్థులకు మైక్ అనుమతి రాకపోవడంతో ప్రచార వాహనాలను ఇంట్లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల అధికారులు ఆన్‌లైన్‌లో మైక్ అనుమతి విధానాన్ని రద్దు చేసి మ్యాన్యువల్‌లో అనుమతి ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


