పీచుపల్లి..
● గ్రామాభివృద్ధికి రూ.10 లక్షలు కేటాయిస్తానన్న కేంద్ర మంత్రి బండి
కరీంనగర్: గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి బీజేపీ బలపర్చిన సామ రాజిరెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నిక ఏకగ్రీవం లాంఛనమైంది. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే రూ.10లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులు కేటాయిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నికల్లేకుండా సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన పీచుపల్లి మొత్తం రూ.20 లక్షల ప్రోత్సాహక నిధులు అందనున్నాయి. నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు.
కేసన్నపల్లి..
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం కేసన్నపల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. సర్పంచ్ నామినేషన్ల కోసం పోతరాజు చంటి, అతని భార్య అనిత నామినేషన్లు వేశారు. మిగతా వారు ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో సర్పంచ్‌గా పోతరాజు చంటి ఏకగ్రీవమైనట్లు గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా ఆరు వార్డులలో ఐదు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఒకటో వార్డులో మాత్రమే పోటీ ఉందని తెలిపారు. 2019లో గ్రామపంచాయతీగా ఏర్పడగా పోతరాజు చంటి తల్లి ఎల్లవ్వ సర్పంచ్‌గా పనిచేశారు.


