‘ఇట్టిరెడ్డి’ పాలన పాతికేళ్లు
● ఏకగ్రీవంగా ఎన్నుకున్న కొండాపూర్ గ్రామస్తులు
కోనరావుపేట(వేములవాడ): పంచాయతీ ఎన్నికల్లో కొండాపూర్ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కొన్నేళ్ల వరకు ఒకే దంపతులు ఈ గ్రామాన్ని పాలించారు. భర్త 20 ఏళ్లు గ్రామానికి సర్పంచ్‌గా పనిచేయగా, భార్య ఐదేళ్లు సేవలందించారు.
మూడు దశాబ్దాలు ఏకగ్రీవం
రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామం గతంలో నిజామాబాద్ గ్రామానికి అనుబంధంగా ఉండేది. 1980లో కొండాపూర్ ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటైంది. 1981లో గ్రామపంచాయతీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో గ్రామస్తులు సమావేశమై ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. గ్రామానికి చెందిన ఇట్టిరెడ్డి రాంరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు రాంరెడ్డి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2000లో జరిగిన ఎన్నికల్లో రాంరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2006లో జరిగిన ఎన్నికల్లో రాంరెడ్డి భార్య ఇట్టిరెడ్డి లక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇలా కొండాపూర్ గ్రామపంచాయతీ చరిత్రలో రాంరెడ్డి కుటుంబమే పాతికేళ్లు పాలించింది. 1995లో జరిగిన ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వేషన్ రావడంతో గొల్లపెల్లి దేవేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇలా భార్యాభర్తలే గ్రామాన్ని పాతికేళ్లు పాలించడం జిల్లాలోనే ఏ గ్రామంలో లేదు. అది కూడా ప్రతీసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మరో విశేషం.
రాంరెడ్డి
లక్ష్మి
‘ఇట్టిరెడ్డి’ పాలన పాతికేళ్లు


