పల్లె ఒక్కటే.. పంచాయతీలు రెండు
కరీంనగర్‌రూరల్: సంచార జీవులకు నిలయమైన మందులపల్లె రెండు గ్రామపంచాయతీలకు నిలయంగా మారింది. మందులపల్లె గ్రామపంచాయతీ కరీంనగర్ జిల్లాకు చెందగా మరొకటి పెద్దపల్లి జిల్లాకు చెందిన నారాయణరావుపల్లె. ఒకే ప్రాంతంలో పైభాగంలో మందులపల్లె ఉండగా కిందివైపు నారాయణరావుపల్లె ఉంటుంది. గత పంచాయతీ ఎన్నికల్లో మూడు గ్రామపంచాయతీలు మందులపల్లె, నారాయణరావుపల్లె, మొగ్ధుంపూర్‌లకు సంబంధించిన ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం మొగ్ధుంపూర్ ఓటర్లను మందులపల్లె జాబితాలో కలుపడంతో రెండు పంచాయతీలకు అడ్డాగా మారింది. మందులపల్లెలో మొత్తం 750 ఓట్లుండగా నారాయణరావుపల్లె పంచాయతీ పరిధిలోకి వచ్చే 6వ వార్డులో 74 ఓట్లున్నాయి. కరీంనగర్ జిల్లాలో మొదటి విడతలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో మందులపల్లె సర్పంచు స్థానం జనరల్ మహిళకు కేటాయించగా ఐదుగురు నామినేషన్లు వేశారు. పెద్దపల్లి జిల్లాలో మూడో విడతలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతోంది. నారాయణరావుపల్లె గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మందులపల్లెలో రాజకీయం వేడెక్కగా.. నారాయణరావుపల్లెలో స్తబ్దత నెలకొంది.


