పోరండ్ల సొసైటీని మూసేసిన రైతులు
● వడ్లు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం
తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండలం పోరండ్లలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై ధర్నా చేసి సొసైటీ కార్యాలయాన్ని మూసి వేయించారు. నెల రోజుల నుంచి ధాన్యం కుప్పలు పోసి ఉన్నాయని, తూకం వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 43 కిలోల చొప్పున తూకం వేసి ట్రాక్టర్లను మిల్లర్ల వద్దకు పంపితే తరుగు పేరిట బస్తాకి మరో ఐదు కిలోలు అదనంగా కట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరుగు పేరిట తీవ్ర నష్టం కలిగిస్తున్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సొసైటీ పాలకవర్గం చొరవ తీసుకొని వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. 3వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు రైస్‌మిల్లు అలాట్మెంట్ అయిందని, ధాన్యం తూకం వేస్తామని తెలపడంతో ఆందోళనను విరమించారు.


