సర్పంచ్‌ ఎన్నికపై ‘వీడీసీ’ పెత్తనం | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ ఎన్నికపై ‘వీడీసీ’ పెత్తనం

Dec 3 2025 7:39 AM | Updated on Dec 3 2025 7:39 AM

సర్పం

సర్పంచ్‌ ఎన్నికపై ‘వీడీసీ’ పెత్తనం

కులసంఘాలతో సమావేశమై వేలం..

మెట్‌పల్లిరూరల్‌: పల్లెల్లో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తమను అడిగేవారు, అడ్డుకునేవారు లేరన్న ధీమాతో పెత్తనం చెలాయిస్తున్నాయి. ఇసుక, మద్యం, కూల్‌డ్రింక్స్‌, చికెన్‌, ఇతరత్రా వాటికి వేలం వేస్తున్న వీడీసీలు.. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన సర్పంచ్‌ ఎన్నికలోనూ జోక్యం చేసుకోవడం వివాదాలకు దారితీస్తోంది. మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో సర్పంచ్‌ పదవికి వీడీసీ సభ్యులు ఆదివారం రూ.28.60 లక్షలకు వేలం వేసినట్లు సమాచారం. ఈ విషయమై అదే గ్రామానికి చెందిన గుడేటికాపు కులస్తులు వీడీసీ ఏకపక్షంగా సర్పంచ్‌ పదవికి వేలం నిర్వహించిందని అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పలు భూములకు సంబంధించిన అంశాల్లో వీడీసీ, గుడేటికాపు కులస్తులకు వివాదం తలెత్తగా.. వారిని వీడీసీ గ్రామ బహిష్కరణ చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు..

జగ్గాసాగర్‌ సర్పంచ్‌ అభ్యర్థిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాల్సి ఉండగా వీడీసీ సభ్యులు, సర్పంచ్‌ పదవికి వేలం వేయడంపై గుడేటికాపు కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మంగళవారం మెట్‌పల్లి ఆర్డీవో, డీఎస్పీ, ఎంపీడీవో, ఎస్సైలను కలిసి ఫిర్యాదు అందించారు. నామినేషన్‌ వేసిన పలువురు పోటీ నుంచి తప్పుకోవాలని వీడీసీ సభ్యులు చెబుతున్నారని వివరించారు. చట్టబద్ధంగా సర్పంచ్‌ ఎన్నిక జరిగేలా చూడాలని అధికారులను కోరారు. ఉపసర్పంచ్‌ పదవికి కూడా వేలం వేసేందుకు వీడీసీ సభ్యులు గ్రామ శివారులోని ఓ చోట రహస్యంగా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడికి పలువురిని పిలిచి తాము అనుకున్న సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ అభ్యర్థులనే గెలిపించుకోవాలని సూచించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనస్థలానికి వెళ్లడంతో వారంతా అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిసింది.

అభ్యర్థులతో అధికారుల సమావేశం

సర్పంచ్‌గా పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసిన అభ్యర్థులు, వీడీసీ సభ్యులతో తహసీల్దార్‌ నీత, ఎంపీడీవో సురేశ్‌, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి, ఆర్‌వో శ్రీనివాస్‌, పోలీసులు జగ్గాసాగర్‌ పంచాయతీ కార్యాలయంలో సమావేశమయ్యారు. చట్టవిరుద్ధంగా సర్పంచ్‌ ఎన్నిక వేలం నిర్వహించడం సరికాదని వీడీసీ సభ్యులను హెచ్చరించారు. సర్పంచ్‌ పోటీ నుంచి తప్పుకోవాలని ఎవరైనా భయపెడుతున్నారా..? ఎవరినుంచైనా ఒత్తిడి ఉందా..? అని అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.

10 మంది బైండోవర్‌..

జగ్గాసాగర్‌ సర్పంచ్‌ వేలం, గుడేటి కాపు కులస్తుల గ్రామ బహిష్కరణ వివాదంలో రెవెన్యూ, పోలీస్‌ అధికారులు 10 మందిని బైండోవర్‌ చేశారు. వీరిలో నలుగురు వీడీసీ సభ్యులు ఉన్నారు. మిగిలిన ఆరుగురు గ్రామస్తులు. చట్టానికి విరుద్ధంగా పనులు చేసినా.. సత్ప్రవర్తనతో మెలగని పక్షంలో రూ.5 లక్షలు జరిమానా విధించేలా హెచ్చరికలు జారీ చేశారు.

వివాదాస్పదమవుతున్న సభ్యుల తీరు

జగ్గాసాగర్‌ సర్పంచ్‌ ఎన్నికలో జోక్యం

గుడేటికాపు కులస్తుల అభ్యంతరం

గ్రామ బహిష్కరణ చేసిన వీడీసీ

పోలీసులకు ఫిర్యాదు.. వీడీసీ సభ్యుల బైండోవర్‌

మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌ సర్పంచ్‌ స్థానం బీసీ జనరల్‌ రిజర్వేషన్‌ ఖరారైంది. దీంతో పోటీలో ఉండేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు.

మొత్తంగా సర్పంచ్‌ స్థానానికి 12 నామినేషన్లు దాఖలయ్యాయి.

నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత సర్పంచ్‌ పదవికి వేలం వేయాలని వీడీసీ నిర్ణయించింది.

ఆదివారం వీడీసీ 17 కులసంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసింది.

అందులో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.20లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తానని వీడీసీ సభ్యులకు తెలిపినట్లు సమాచారం.

బహిరంగ వేలం వేస్తే మరింత ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశముందని భావించిన వీడీసీ సభ్యులు వేలం నిర్వహించారు.

ఇందులో ఓ వ్యక్తి అత్యధికంగా రూ.28.60 లక్షలు చెల్లించడానికి ముందుకొచ్చాడు. అతడినే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని వీడీసీ సభ్యులు నిర్ణయించినట్లు తెలిసింది.

సర్పంచ్‌ ఎన్నికపై ‘వీడీసీ’ పెత్తనం 1
1/1

సర్పంచ్‌ ఎన్నికపై ‘వీడీసీ’ పెత్తనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement