ఐదు నిమిషాల ఆలస్యంతో చెదిరిన ఎన్ని‘కల’
తంగళ్లపల్లి(సిరిసిల్ల): వార్డు మెంబర్‌గా ఎన్నికై ప్రజాసేవ చేద్దామనుకున్న ఓ అభ్యర్థి కల ఐదు నిమిషాల ఆలస్యంతో ముగిసిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మేజర్ గ్రామపంచాయతీ 1వ వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు నేరెళ్ల శ్రీధర్ అన్నీ సిద్ధం చేసుకున్నాడు. నామినేషన్ కేంద్రానికి చేరుకుని తనవంతు కోసం వేచిచూశాడు. కాగా పత్రాలను పరిశీలిస్తున్న సమయంలో క్యాస్ట్ సర్టిఫికెట్ లేదని గుర్తించి తీసుకు రావడానికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి నామినేషన్ సమయం ముగిసి 5 నిమిషాలు ఆలస్యం కావడంతో పోలీసులు అతడిని అనుమతించలేదు. కాగా, అధికారులు తన పత్రాలను సరిగా చూడకపోవడం వల్లే నామినేషన్ వేయలేకుండా పోయాయని, నామినేషన్ వేసేందుకు రూ.6 వేలు ఖర్చు చేశానని వాపోయాడు.


