తమ్ముడూ.. తప్పుకో! | - | Sakshi
Sakshi News home page

తమ్ముడూ.. తప్పుకో!

Dec 2 2025 7:30 AM | Updated on Dec 2 2025 7:30 AM

తమ్ముడూ.. తప్పుకో!

తమ్ముడూ.. తప్పుకో!

తాయిలాల ఆశ చూపి..

జిల్లాలో తొలి విడత నామినేషన్లు

మొదలైన బుజ్జగింపుల పర్వం

ఒకే పార్టీ నుంచి నలుగురైదుగురు అభ్యర్థుల నామినేషన్లు

రంగంలోకి సీనియర్లు.. రెబల్స్‌ను బతిమాలడాలు

మున్ముందు మంచి అవకాశాలంటూ తాయిలాలు

ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో ప్రాధాన్యమిస్తామంటూ హామీ

రేపటికి తొలిదశ నామినేషన్ల ఉపసంహరణకు గడువు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

తొలిదశ నామినేషన్లకు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ఒకటే టెన్షన్‌ పట్టుకుంది. అదేంటంటే.. ప్రతీ పార్టీ నుంచి నలుగురైదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామ స్థాయి కార్యకర్తలు ఏళ్లుగా స్థానిక సంస్థల్లో పోటీ కోసం ఎదురుచూస్తున్నారు. తీరా ఆ అవకాశం రాగానే ఎగిరి గంతేసి బరిలోకి దూకారు. స్వతంత్ర అభ్యర్థులతో ఎలాంటి ఇబ్బందులు లేవుగానీ, తీరా పార్టీ అభ్యర్థులతోనే చిక్కులన్నీ. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఇతర పార్టీలన్నీ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. అన్ని పార్టీల నుంచి అధిక సంఖ్యలో పోటీ ఉండడం మంచిది కాదని తలచి.. మధ్యవర్తిత్వానికి జిల్లా నాయకులను పార్టీలు రంగంలోకి దించుతున్నాయి. ఈ మేరకు రెబల్‌ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. రిజర్వ్‌డ్‌ స్థానాల కంటే జనరల్‌ స్థానాల్లో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో బరిలో ఉన్నారు. ఈనెల 3వ తేదీతో తొలిదశ నామినేషన్ల పర్వం ముగుస్తున్న నేపథ్యంలో సీనియర్లు బుజ్జగింపుల పర్వాన్ని ముమ్మరం చేశారు.

కులం ఓట్లే ప్రామాణికం

ప్రతీ సర్పంచ్‌ అభ్యర్థి ఎవరికి వారు పోటీలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బుజ్జగింపుల పర్వరంలోకి దిగిన సీనియర్లు అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తున్నారు. అయితే, అభ్యర్థుల సామాజిక స్థితిగతులు, అతని సామాజికవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎంత ఖర్చు పెట్టగలుగుతారు? తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాంటి వారిని గుర్తించి తగిన హామీలు ఇచ్చి, పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతివ్వాలని కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లో సామాజికవర్గం ఓట్లు దండిగా ఉన్న అభ్యర్థులు మెట్టుదిగేది లేదని, పోటీ చేసి తీరుతామని భీష్మించుకుంటున్నారు. ఇలాంటి వారి విషయంలో పార్టీ సీనియర్లు కూడా ఏమీ చేయలేని అయోమయంలో ఉన్నారు. అందుకే, గెలిచిన వాడే మనవాడు అవుతాడని, అప్పటి వరకూ వేచి చూసే ధోరణి అవలంబించేందుకు మొగ్గుచూపుతున్నారు.

దాదాపు రెండేళ్లుగా జాప్యమైన స్థానిక ఎన్నికలకు ఎట్టకేలకు నోటిఫికేషన్‌ విడుదలై.. ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న వేళ.. ఆశావహులంతా నామినేషన్లు వేసి ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇదే అన్ని పార్టీలకు మింగుడు పడని అంశంగా మారింది. అందుకే, సీనియర్లను రంగంలోకి దింపారు. దీంతో వారంతా నామినేషన్‌ వేసిన వారితో భేటీ అవుతున్నారు. పార్టీలో పదవుల పరంగా ప్రాధాన్యం కల్పిస్తామంటూ, భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కుతాయని హామీలిస్తున్నారు. అంతేకాకుండా త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టికెట్‌ కల్పించేందుక సిద్ధంగా ఉన్నామంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం పార్టీలో పదవులు, స్థానిక సంస్థల్లో టికెట్ల అవకాశంతో పాటు అధికార పార్టీ మరో అడుగు ముందుకు వేస్తోంది. స్థానికంగా జరిగే వర్క్స్‌, టెండర్లలోనూ ప్రాధాన్యం కల్పిస్తామంటూ వారిలో నమ్మకం కలిగించే ప్రయత్నాలు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement