విలేజ్ వాయిస్
పొలాలకు పోవుడు కష్టమైతాంది
నెరవేరని బీటీ రోడ్డు కల
మంథనిరూరల్: ఎన్నికలు.. ఓట్లు రాగానే ఊళ్లో సమస్యలు తీరుస్తామని అభ్యర్థులు హామీలు ఇవ్వడం సర్వసాధారణమే. ఎన్నికలు ముగిశాక మళ్లీ ఆ సమస్యను పట్టించుకోకపోవడం సర్వసాధారణమే. ఇలాంటి సమస్యే పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారంలో ప్రజల్ని పట్టిపీడిస్తోంది. మట్టి రోడ్డు బీటి రోడ్డుగా ఎప్పుడు మారుతుందోనని దశాబ్దాలుగా ఎదురుచూపులు తప్ప రైతుల కల నెరవేరడం లేదు. నాగారం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ పక్కనుంచి ఉప్పట్ల వరకు గతంలో మట్టిరోడ్డు ఉండేది. దీనిపరిధిలో సుమారు 300 ఎకరాల నుంచి 400ఎకరాల వరకు భూములు ఉన్నాయి. ఏటా సాగు పనులకు ఈ రోడ్డు ద్వారానే వెళ్తుంటారు. వర్షాకాలంలో రోడ్డు బురదమయం కావడంతో రైతుల కష్టాలు అంతాఇంతా కాదు. సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తన బస్తాలు తీసుకురావడానికి నానాతంటాలు పడుతుంటారు. వర్షం పడితే కాలినడకే శరణ్యం. గత ఎన్నికల సమయంలో ఈ రోడ్డు బాగు చేయిస్తామని ఇచ్చిన హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని వాపోతున్నారు.
ఎన్నికలయ్యే వరకు నీకు నాకు కటీఫ్..
రాయికల్: పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని నిన్నటివరకు మిత్రులుగా ఉన్నవారు దూరందూరంగా ఉంటున్నారు. పొద్దంతా ఒకే వాహనంపై తిరుగుతూ సరదాగా గడిపిన వారు ఇప్పుడు ఎవరిదారిన వారు వెళ్లిపోతున్నారు. సర్పంచ్‌గా పోటీచేసే ఆశావహులు తన మిత్రులు ఇతరవ్యక్తులకు నచ్చకపోతే ఎక్కడ ఓట్లు పడవోనని భావించి.. శత్రువును చూసినట్లు చూస్తున్నారు. దీంతో ఓటర్లంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొన్నటి వరకు తన స్నేహితుడు అని చెప్పుకుని ఎన్నికల వేళ తనకు శత్రువు అంటే ఎవరు నమ్ముతారంటూ ఓటర్లు చర్చించుకుంటున్నారు. పోలింగ్ వరకు ఇలాంటి నాటకీయ పరిణామాలు ఎన్ని చూడాల్సి వస్తుందోనని ప్రజలు గుసగుసలాడుతున్నారు.
ఎన్నికల బరిలో రేషన్ డీలర్లు.. ఆర్‌ఎంపీలు
జగిత్యాలజోన్: సర్పంచ్‌గా పోటీ చేసేందుకు రేషన్ డీలర్లు, ఆర్‌ఎంపీలు కూడా సై అంటున్నా రు. రేషన్ సరుకుల కోసం వచ్చిన వారితో సత్సంబంధాలు ఉండటంతో రేషన్ డీలర్లు.. అనారో గ్యం బారినపడిన వారికి వైద్యం అందించేందుకు ఇళ్లిళ్లూ తిరిగే ఆర్‌ఎంపీలు ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గెలిస్తే సర్పంచ్.. లేదంటే మళ్లీ అదే పని చేసుకోవచ్చు.. అంటూ వారిని బంధువులు, తెలిసిన వారు ఊదరగొ డుతున్నారు. అభ్యర్థులు ఖర్చు జోలికి వెళ్లకుండా నే రుగా ఓటర్లను కలిసి తమను గెలిపిస్తే అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.
సర్పంచ్‌కు ఫికర్ లేదు
కరీంనగర్‌టౌన్: సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతున్నందున వీరిపై అవిశ్వాసం పెట్టే అవకాశం లేకుండా పోతుంది. సర్పంచ్ ఏదేని అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడితే తప్పా ఎలాంటి ఢోకా లేకుండా ఐదేళ్లు పదవిలో ఉండొచ్చు. అక్రమాలపై ఫిర్యాదులు అందితే కలెక్టర్, డీపీవో విచారణ జరిపించి నిజమని తేలితే పదవి నుంచి తొలగించే అధికారం ఉంది. అలాగే గ్రామ సభలు ఏడాదిలో రెండుసార్లు నిర్వహించకుంటే పదవి కోల్పోయే ప్రమాదముంది. సర్పంచ్ పదవి ఖాళీ ఏర్పడితే 4 నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తారు.
ఉపసర్పంచ్‌పై అవిశ్వాసం పెట్టొచ్చు
పదవి చేపట్టిన నాలుగేళ్ల తర్వాత ఉప సర్పంచ్‌పై అవిశ్వాసం పెట్టే వీలుంటుంది. పంచాయతీలోని సగానికిపైగా వార్డు సభ్యులు సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం చేసి రెవెన్యూ డివిజన్‌లోని అధికారికి సమర్పించాలి. మొత్తం వార్డు సభ్యుల్లో రెండింట మూడో వంతు అవిశ్వాసానికి ఆమోదం తెలిపితే ఉప సర్పంచ్ పదవి కోల్పోతారు. ఈ పదవిని ఖాళీ అయిన 30 రోజుల్లో తిరిగి కొత్తగా ఎన్నుకోవాలి. సర్పంచ్ అధ్యక్షతన మెజార్టీ సభ్యులు చేతులెత్తే పద్ధతిన ఉపసర్పంచును ఎన్నుకుంటారు.
సర్పంచ్ గౌరవవేతనం ఎంతో తెలుసా?
కరీంనగర్‌టౌన్: గ్రామ పంచాయతీలో మొదటి పౌరుడు సర్పంచ్. పంచాయతీ ఎన్నికల షెడ్యూ ల్ విడుదలవడంతో సర్పంచులకు గౌరవ వేత నం ఎంత ఉంటుందనేది పలువర్గాల ప్రజల్లో చర్చనీశయాంశంగా మారింది. 2021కి ముందు సర్పంచులకు నెలకు రూ.5 వేల గౌవర వేతనం ఉండేది. తర్వాత నుంచి రూ.6,500 చెల్లిస్తున్నారు. ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు పా రితోషకం, గౌరవవేతనం ఉండదు. వార్డు సభ్యులు మూడు సమావేశాలకు, మహిళ సభ్యులు ఆరు సమావేశాలకు వరుసగా హాజరుకాకుంటే కలెక్టర్ వారిని పదవికి అనర్హులుగా ప్రకటిస్తారు.
దశాబ్దాలుగా ఎదురుచూపులే
ఓట్ల్లేస్తే రోడ్డస్తదనే ఆశలు మొదలు
రైతులకు తప్పని బురదరోడ్డు కష్టాలు
పది ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తా. వర్షాలు పడితే పొలం కాడికి పోవడం కష్టమైతాంది. రోడ్డంతా బురదమయమై నడవలేని పరిస్థితి ఉంటది. ఈరోడ్డు బీటీ రోడ్డు అయితే మా కష్టాలన్నీ తీరిపోతయ్. ఈసారైనా రోడ్డు బాగు చేయిస్తే రుణపడి ఉంటం.
– గోపు శ్రీకాంత్, రైతు, నాగారం


