కాసుల కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కాసుల కష్టాలు

Dec 2 2025 7:30 AM | Updated on Dec 2 2025 7:30 AM

కాసుల కష్టాలు

కాసుల కష్టాలు

హుజూరాబాద్‌: సర్పంచ్‌గా పోటీ చేయాలని ఆశ.. కానీ, ఖర్చులు భరించేందుకు పైసలు ఎట్లా అనే మీమాంస.. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసి వచ్చి పోటీకి ఉత్సాహం ఉన్నా.. చేతిలో చిల్లిగవ్వలేక ఆశావహుల్లో నిరాశ. తాజామాజీ సర్పంచ్‌లకు చేసిన పనులకు బిల్లులే రాక ఇంకా అవస్థలు పడుతున్న తీరు పోటీదారులకు అప్పు పుట్టకుండా చేస్తోంది. ప్రధాన పార్టీల మద్దతు కావాలన్నా.. ‘నీ చేతిలో ఎంత ఉందో ముందు చెప్పు’ అంటూ ఎదురు ప్రశ్నలు. దీనికి తోడు రియల్‌ భూమ్‌ లేకపోవడం, పంటల ఆదాయం అంతంతే ఉండటంతో అభ్యర్థులను కాసుల కష్టాలు వెంటాడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తెలిసినోళ్లందరినీ కలిసి ‘నీ దగ్గర ఏమైనా ఉంటే సర్దుబాటు చేయ్‌’ అంటూ పాట్లు పడుతున్నారు.

పోటీ సరే.. పెసలెట్లా..?

అసెంబ్లీ, పార్లమెంట్‌, సర్పంచ్‌.. ఏ ఎన్నికై నా కాసులతో ముడిపడిపోయింది. ప్రచారంలో ప్రత్యర్థులకు దీటుగా రంగంలో ఉండాల్సిందే. ఖర్చులో తగ్గేదేలే అంటేనే క్యాడర్‌ అభ్యర్థి వెనుక నిలబడుతుంది. లేదంటే వారి దారి వారిదే అనే భయం. దీంతో పోటీకి సిద్ధమైన అభ్యర్థులకు ఖర్చుల టెన్షన్‌ పట్టుకుంది. ఎన్నికల్లో బ్యానర్లు, వాల్‌ పోస్టర్లు, ప్రచార వాహనాలు, రోజువారి క్యాడర్‌ ఖర్చు, పోల్‌ మేనేజ్‌మెంట్‌ వీటన్నింటికి తోడు మందు, మాంసం లెక్కలు వేరే అనే టాక్‌ ఉంది. వెయ్యి ఓట్ల లోపు గ్రామమైతే తక్కువలో తక్కువగా రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందనే అంచనాల్లో ఉన్నారు. రెండువేల లోపు జీపీల్లో ఒక్కో అభ్యర్థికి రూ.20 లక్షల పైమాటే అనే టాక్‌ ఉంది. ఇక 2వేలకు పైగా ఓటర్లు ఉంటే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు.. ఆపైన కూడా ఖర్చు పెరుగుతుందనే చర్చ ఉంది. ఖర్చులే కాకుండా సొంత పార్టీ నుంచి పోటీకి దిగుతున్నవారిని తప్పించేందుకు రూ.లక్షల్లో చేతిలో పెట్టాల్సిందే. అయితే మరోవైపు ఏకగీవ్రం ఆశావహులను ఊరిస్తోంది. ఎవరితో పోటీ, ప్రచార లొల్లి, ఖర్చుల బాధ లేకుండా సర్పంచ్‌ సీటులో కూర్చోవచ్చునని ఉవ్విళ్లూరుతున్నవారు కూడా ఉన్నారు. అయితే ఏకగ్రీవం పేరుతో గ్రామ అభివృద్ధికి, పోటీ నుంచి తప్పుకునేవారికి, చివరికి ఓటర్లకు దావత్‌.. ఇలా ఖర్చుల మీద ఖర్చులు తప్పవనే ప్రచారం ఉంది. దీంతో చేతిలో చిల్లీ గవ్వ లేకున్నా మద్దతుదారుల ప్రోత్సాహంలో సర్పంచ్‌ బరిలో దిగుతున్న అభ్యర్థులను కాసుల కష్టాలు కలవరపెడుతున్నాయి.

సర్దుబాటుకు తంటాలు

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాననే ఆనందం ఒకవైపు, ఖర్చులకు అప్పు ఎట్లా అనే ఆందోళన మరో వైపు అభ్యర్థులను కలవర పరుస్తోంది. తెలిసినోళ్లందరికీ ఫోన్‌ చేసి అప్పు కోసం బతిమిలాడాల్సి వస్తోంది. అభ్యర్థులు వడ్డీ వ్యాపారులను కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే తాజా మాజీ సర్పంచుల అనుభవాలను చూసిన వ్యాపారులు, పెట్టుబడిదారులు కూడా ఎన్నికల కోసం అప్పు ఇచ్చేందుకు ససేమేరా అంటున్నారు. మాజీ సర్పంచులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అప్పు ఇచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. దీంతో కొందరు తమ భూములను తాకట్టు పెట్టే పనిలో ఉండగా, మరికొందరు భార్య, పిల్లలు, తల్లికి సంబంధించిన బంగారు ఆభరణాలను తాకట్టు పెడుతున్నారు. కాగా, లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పోటీ చేస్తే మిగిలేది ఏమిటనే ఆలోచనలో మరి కొందరు ఉన్నారు. తాజా మాజీ సర్పంచుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని, వృథా ఖర్చులు లేకుండా పోటీ చేయాలని అభ్యర్థుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు.

పదవిపై మోజుతో బరిలోకి పలువురు

ఎన్నికల ఖర్చుకు సరిపడా డబ్బుల్లేక వెతలు

పోటీదారులకు అప్పు ఇచ్చేందుకు ఆసక్తి చూపని వడ్డీవ్యాపారులు

మాజీ సర్పంచ్‌లకే చేసిన పనులకు బిల్లులు పెండింగ్‌

గెలిచినా ఖర్చుపెట్టింది సంపాదించేదెప్పుడో అనే అనుమానం

డబ్బు సర్దుబాటుకు అభ్యర్థుల పాట్లు

చేతిలో చిల్లిగవ్వ లేకున్నా పోటీకి సై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement