వారిది ఆరాటం.. వీరిది ఆపేయత్నం
● పీఎల్‌జీఏ వారోత్సవాలపై ఉత్కంఠ
● అమరులకు నివాళి అనుమానమే?
● కొయ్యూర్ ఎన్‌కౌంటర్‌కు 26 ఏళ్లు
మంథని: 1999 డిసెంబర్ 2వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రస్తుత మావోయిస్టు(అప్పటి పీపుల్స్‌వార్) పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్‌షరెడ్డి, ఉత్తర తెలంగాణ కార్యదర్శి శీలం నరేశ్ నేలకొరిగారు. వీరిజ్ఞాపకార్థం 2000 డిసెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు పీఎల్‌జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాలను మావోయిస్టు పార్టీ ఏటా నిర్వహనిర్వహిస్తూ వస్తోంది. అమరవీరుల జ్ఞాపకార్థం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో 2004 నవంబర్ 13న మావోయిస్ట స్మారక స్తూపం నిర్మించింది. దానిని మృతుల కుటుంబ సభ్యులతో ఆవిష్కరింపజేసింది. కొయ్యూరు ఎన్‌కౌంటర్ జరిగి మంగళవారానికి 26ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవడంతో పీఎల్‌జీఏ వారోత్సవాలపై నీలినీడలు అలుముకున్నాయి.
ఉనికి కనుమరుగు చేసేందుకు..
మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేసి అమరులైన ప్రతీఒక్కరికి ప్రజాక్షేత్రంలో నివాళి అర్పించేందుకు ఏటికేడు నక్సల్స్ యత్నిస్తున్నారు. వారి ఉనికిని కనుమరుగు చేసేందుకు పోలీసులు కట్టడికి యత్నిస్తూనే ఉన్నారు. రెండు దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గానికి అవతలి వైపు మహారాష్ట్ర, ఛత్తీష్‌గఢ్ రాష్ట్రాలు ఉండడం, ఆ రాష్ట్రాల పరిధిలోని గోదావరి, ప్రాణహిత తీర ప్రాంతాల్లో మావోయిస్ట్‌లు రెండు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండడం సాధారణమే. పాతికేళ్లకుపైగా కరీంనగర్ తూర్పు డివిజన్‌లో మావోల ప్రభావం పెద్దగా లేకున్నా తరచూ కదలికలు ఉన్నట్లు సమాచారం. అగ్రనేతలు మరణించి 26ఏళ్లు అవుతున్న క్రమంలో అమరులను స్మరిస్తూ వారోత్సవాలు నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులు లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. తొలితరం అగ్రనేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌తో పాటు సుమారు 60 మందితో గత అక్టోబర్‌లో లొంగిపోయారు. ఆ తర్వాత మరో అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ కావడం, మిగతా మావోయిస్ట్‌లు సైతం లొంగిపోతామని ప్రకటించడం లాంటి చర్యలు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయంటున్నారు.
అటవీ గ్రామాలపై పోలీస్ నిఘా
కరీంనగర్ తూర్పు డివిజన్‌లో మావోయిస్ట్‌ల ప్రభావం లేకున్నా వివిధ రాష్ట్రాల్లోని ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా పోలీసులు నిఘాను తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. మావోయిస్ట్‌లు నదులను దాటి రాకపోకలు సాగించే అవకాశాలు ఉండడంతో ఆ ప్రాంతాలపై డేగ కన్నేసి ఉంచుతారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ఊపందుకోవడంతో పోలీసులు సహజంగానే అత్యంత అప్రమత్తంగా ఉన్నారు.
వారిది ఆరాటం.. వీరిది ఆపేయత్నం


