రైతు ఆత్మహత్యాయత్నం
హుజూరాబాద్‌రూరల్: మండలంలోని కందుగుల గ్రామానికి చెందిన రైతు ఇమ్మడి సదానందం అప్పు ల బాధ తట్టుకోలేక సోమవారం పురుగులమందు తాగాడు. వెంటనే స్థానికులు 108లో హుజూరా బాద్ ఏరియా ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు.
తండ్రీకూతుళ్లు..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌కు చెందిన మిట్టపల్లి అఖిల అనే వివాహితను అత్తింటివారు వేధింపులకు గురి చేస్తుండగా, ఈ విషయంలో పోలీసులు తమకు సరైన న్యాయం చేయలేదని ఆరోపిస్తూ.. ఐదు రోజుల వ్యవధిలో తండ్రీకూతుళ్లు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుల వివరాలు.. రాచర్లబొప్పాపూర్‌కు చెందిన అఖిలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన కృష్ణకాంత్‌తో 11 నెలల క్రితం వివాహం జరిగింది. అనంతరం ఆరునెలల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఐదునెలలుగా అదనపు కట్నం కోసం అఖిలను అత్తింటి వారు వేధించసాగారు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చింది. అత్తింటివారు కట్నం కోసం వేధిస్తున్నారని నాలుగునెలల క్రితం ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో అఖిల గత నెల 30న పురుగులమందు తాగింది. స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్ తరలించారు. ఈ క్రమంలోనే తన కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ అఖిల తండ్రి మిట్టపల్లి ఆంజనేయులు గత శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆంజనేయులు ఆరోగ్యం కుదుటపడడంతో ఇంటికి వచ్చాడు. ఈ విషయంపై ఎస్సై రాహుల్‌రెడ్డిని వివరణ కోరగా.. అఖిల ఫిర్యాదు మేరకు భర్త కృష్ణకాంత్, అత్త, మామ, ఆడబిడ్డలపై అదనపు కట్నం కేసు నమోదు చేశామన్నారు. కేసు విషయంలో అత్తింటివారికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదని అఖిల, ఆంజనేయులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు.


