బీర్లు, బిర్యానీలు కాదు.. రోడ్లు మరమ్మతు చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీర్లు, బిర్యానీల పేరిట పోటీపడి రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు.. వాటికి బదులు మా కరీంనగర్‌లో రోడ్లు బాగు చేయొచ్చు.. గుంతలతో రోజూ నరకం చూస్తున్నాం.. తక్షణమే మరమ్మతు చేయండి. అని నగరానికి చెందిన సామాజిక కార్యకర్తలు దుంపేటి రాము, ఉమర్ అన్సారీ వినూత్న రీతిలో నిరసన తెలియచేశారు. సోమవారం నగరంలోని కేబుల్ బ్రిడ్జి జంక్షన్ ఎదుట రాజీవ్‌రహదారి బైపాస్ రోడ్డులోని గుంతల్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. వారు మాట్లాడుతూ, నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే మెయిన్‌రోడ్డు గుంతలుపడి అధ్వానంగా మారినా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. రాజీవ్ రహదారి, కేబుల్ బ్రిడ్జి రోడ్డు జంక్షన్‌లో గుంతలు నరకం చూపిస్తున్నాయన్నారు. తరచూ ప్రమాదాలు కూడా చోటుచేసుకొంటున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రూ.కోట్లు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తూ, కనీసావసరాలైన రోడ్లను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా కేబుల్ బ్రిడ్జి జంక్షన్ రోడ్డు మరమ్మతు చేయాలని వారు కోరారు.
కరీంనగర్‌క్రైం: మహిళలు, యువతులు, బాలికల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, వారి రక్షణ కోసం షీటీంలు పనిచేస్తున్నాయని సీపీ గౌస్ ఆలం స్పష్టంచేశారు. యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు నిరంతరం పనిచేస్తున్నాయని, విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ఫిర్యాదుచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. గతనెల జిల్లావ్యాప్తంగా షీటీమ్స్ ద్వారా 42 అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, కరీంనగర్, హుజూరాబాద్ సబ్ డివిజన్లలో షీ టీమ్ స్టాల్స్‌ను ఏర్పాటుచేసి వీడియోల టీ సేఫ్‌పై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. 8 క్రిమినల్ కేసులు, 2 పెట్టీ కేసులు, 13 మందికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్, 70 హాట్‌స్పాట్‌లలో నిఘా ఉంచి 38 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఈ నెల 30 వరకు జిల్లాలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉన్నత విద్య బంద్ షురూ
సప్తగిరికాలనీ(కరీంనగర్): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కళాశాలలపై భిన్న వైఖరిని అవలంబిస్తున్న కారణంగా డిగ్రీ, పీజీ కళాశాలల నిరవధిక బంద్ సోమవారంతో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలు నిరవధిక బందుకు పిలుపునివ్వడంతో.. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్ పాటించాయి. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వివిధ కళాశాలల యాజమాన్యాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. సుప్మా కరీంనగర్ పట్టణ అధ్యక్షుడు గోవిందవరం కృష్ణ మాట్లాడుతూ.. 4 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో ఇటు యాజమాన్యాలు, అటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కళాశాలలను నడిపే పరిస్థితి లేదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. వివిధ కళాశాలల కరస్పాండెంట్లు వి.రవీందర్‌రెడ్డి, పి.వేణు, వర్మ, సతీశ్, అధ్యాపకులు పాల్గొన్నారు.
							బీర్లు, బిర్యానీలు కాదు.. రోడ్లు మరమ్మతు చేయాలి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
