ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో వందశాతం యూరియా ఉత్పత్తి
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో పూర్తిసామర్థ్యంతో యూరియా ఉత్పత్తి జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించిన రామగుండం ఎరువుల కర్మాగారం.. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఆరు రాష్ట్రాల్లో యూరియా సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. గత ఆగస్టు 14న అమ్మోనియా కన్వర్టర్ పైప్‌లైన్ లీక్ కావడంతో ప్లాంట్ షట్‌డౌన్ చేశారు. మరమ్మత్తుల అనంతరం సెప్టెంబర్ 28న పునరుద్ధరించారు. ప్లాంట్ సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా. హెచ్‌టీఆర్‌లో అమ్మోనియా కన్వర్టర్ మరమ్మతుల అనంతరం ప్లాంట్ పూర్తిసామర్థ్యంతో నెలరోజులుగా అంతరాయం లేకుండా యూరియా ఉత్పత్తి చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌లో 1,03,614.030 మెట్రిక్ టన్నుల నీం కోటెడ్ యూరియా ఉత్పత్తి చేసినట్లు ఆర్‌ఎఫ్‌సీఎల్ జీఎం(ప్రాజెక్ట్), యూనిట్ హెడ్ రాజీవ్ ఖుల్బే సోమవారం తెలిపారు. తెలంగాణకు 45,561.780 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 22,720.230 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 18,943.470 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 16,388.550 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని అన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తికి సహకరించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులను అభినందించారు.


