సీపీఐ శతజయంతి ఉత్సవాలకు సిద్ధం కావాలి
కరీంనగర్‌టౌన్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భవించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల 26న నిర్వహించే శతజయంతి ఉత్సవాలకు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డిభవన్‌లో సోమవారం జరిగిన జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీపీఐ ఏర్పడిన వందేళ్లలో దేశంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి ప్రజల హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రతీ ఊరు, వాడవాడలో పార్టీ జెండాలు ఎగురవేసి, ర్యాలీలు, సభలు, సెమినార్లు నిర్వహించి పార్టీ చరిత్రను నేటి తరానికి చేరవేయాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ శతజయంతి ఉత్సవాలను జిల్లాలోని అన్ని గ్రామాల్లో జాతాల రూపంలో నిర్వహించి ప్రజలకు సీపీఐ ప్రజాపక్ష ధోరణిని తెలియజేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి కసిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా.. నాయకులు పొనగంటి కేదారి, అందె స్వామి, మర్రి వెంకటస్వామి, బోయిని అశోక్ తదితరులు పాల్గొన్నారు.


