
బీఫాంలు నేనే ఇస్తా
● నేను లోకల్ వాడిని ● మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్
హుజూరాబాద్: ‘నేను 25 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో నాయకుడిగా కొనసాగాను. నేను లోకల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బీఫాంలు నేనే ఇస్తా’ అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో శుక్రవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో గందరగోళం సృష్టించిందన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేశారన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పి, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మొదటి నుంచి సపోర్ట్ చేసిందని స్పష్టం చేశారు. బీసీ సంఘాలు ఈ విషయంపై ఆలోచించాలని కోరారు. పనులు చేసిన పాత ప్రజాప్రతినిధులకు, రెసిడెన్షియల్ స్కూళ్లలోని పిల్లలకు సంబంధించిన బిల్లులు చెల్లించాలి డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఎప్పటికై నా ప్రజలకు అండగా ఉండేది బీజేపీ మాత్రమేనన్నారు.