
వైద్యరంగానికి దిశానిర్దేశం
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ వీ–కన్వెన్షన్ హాల్ వేదికగా 2 రోజులపాటు ఘనంగా జరిగిన ఫిజీషియన్స్ అసోసియేషన్ 9వ రాష్ట్ర సదస్సు ఆదివారం సాయంత్రం ముగిసింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది వైద్యులు, జూనియర్ డాక్టర్లు, పీజీ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, పరిశోధకులు పాల్గొన్న సదస్సులో వైద్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను సూచించడమే కాకుండా.. సాంకేతికతతో కలిపి మానవీయతకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరాన్ని సూచించారు. ఇటువంటి సదస్సులు వైద్యరంగ అభివృద్ధికి గల ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయని, ప్రస్తుత వైద్య సవాళ్లను ఎదుర్కొనే దిశగా ఇది ఒక ఆత్మ పరిశీలన వేదికగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు.
వైద్యరంగానికి సవాళ్లు
ఈ సదస్సులో క్లినికల్ డిసిషన్ మేకింగ్, డిజిటల్ హెల్త్ టూల్స్ వినియోగం, రిసెర్చ్ ఆధారిత చికిత్సలు వంటి ముఖ్య అంశాలపై సుదీర్ఘంగా చర్చలు సాగాయి. మారుతున్న జీవనశైలి, నూతన వ్యాధులు సంభవించడం, పాత వైద్య విధానాలకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయాల అవసరం వంటి అంశాలపై నిపుణులు వివరించారు. వైద్య నిర్ణయాల్లో టెక్నాలజీ వాడకం ఎంతగా అవసరమైందో, అదే సమయంలో మానవీయతకు తావివ్వడం ఎందుకు అవసరమో స్పష్టంగా వివరించారు.
వైద్యంలో ఏఐ నూతన విప్లవం
ప్రస్తుతం డిజిటల్ హెల్త్ టూల్స్ వంటి ఏఐ ఆధారిత టెక్నాలజీలు వైద్య రంగంలో వేగంగా ప్రవేశిస్తున్నట్లు నిపుణులు వివరించారు. రోగ నిర్ధారణ, చికిత్స పద్ధతుల్లో వేగం, కచ్చితత్వం పెరగడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే టెక్నాలజీ అనేది మానవతావాదంతో కలిసి ప్రయోజనకరంగా ఉపయోగించాలన్నారు. కేవలం మెషీన్ ఆధారంగా వైద్య నిర్ణయాలు తీసుకోవడం సరైన దారి కాదని సూచించారు.
అనుభవజ్ఞుల మార్గదర్శనం
పీజీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ఈ సదస్సులో భాగస్వాములవడం సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనుభవజ్ఞులైన సీనియర్ వైద్యులు తన అనుభవాలను పంచుకోవడంతో వారిలో కొత్త ఆలోచనలకు ఊతం లభించిందని, వారి వైద్య దృక్పథంలో మార్పు వస్తోందని నిర్వాహకులు తెలిపారు. వైద్యులు కేవలం రోగ నిర్ధారణ చేయడంలో కాదు.. సమాజంలో మార్గదర్శకులుగా మారే దిశగా దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు ప్రస్తావించారు.
అధునాతన సాంకేతిక వైద్యంపై పలువురు వక్తల ప్రజెంటేషన్
ముగిసిన ఫిజీషియన్స్ అసోసియేషన్ 9వ రాష్ట్ర సదస్సు