
పోషకాహారంతోనే ఆరోగ్యం
కరీంనగర్: పోషకాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. పోషణమాసంలో భాగంగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని కోతిరాంపూర్ హైస్కూల్‌లో శుక్రవారం సభ, ఫుడ్‌ఫెస్టివల్ నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోషకాహారంపై అవగాహన పెంచుకుని వంట చేయాలని మహిళలకు సూచించారు. పిల్లలకు ఇంటి, వంట పనులతో పాటు ఆరోగ్యకర ఆహారం తయారు చేసే విధానం నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. బాలింతలు ఐరన్, కాల్షియం, మాత్రలు తీసుకోవాలన్నారు. ఫుడ్‌ఫెస్టివల్‌లో విద్యార్థులు తయారు చేసిన ఆహార పదార్థాల ప్రదర్శనను పరిశీలించారు. చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, సీడీపీవో సబిత, మెప్మా పీడీ స్వరూపరాణి పాల్గొన్నారు.
ఆర్థిక ఆస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోండి
కరీంనగర్ అర్బన్: క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల పరిష్కారానికి ప్రచారాన్ని నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 31వరకు క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల పరిష్కారం కోసం ఒక ప్రచారాన్ని నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించిందని వివరించారు. 10 ఏళ్లు, ఎక్కువకాలం బ్యాంకు ఖాతాలో మొత్తం ఉండి మరిచిపోయినవారు బ్యాంక్‌కు వచ్చి ఆధార్ కార్డ్, పాన్‌కార్డ్ జిరాక్స్ కాపీ ఇవ్వాలని తెలిపారు.
భూ సేకరణ సమస్యలు పరిష్కరించాలి
భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 కోసం భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. జాతీయ రహదారి సంస్థ వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు భరద్వాజ్, రెవెన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేశ్ బాబు పాల్గొన్నారు.