
‘కాంగ్రెస్ బాకీ కార్డు’తో చైతన్యపరుస్తాం
కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష నుంచి లక్షన్నర రూపాయల బాకీ పడిందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పేందుకే బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీకార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంపిణీ చేశారు. అంతకుముందు కార్ఖానగడ్డ గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలతో పాటు 420 హమీలనిచ్చి భరోసా కార్డుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, 22 నెలల పాలనలో ఆ హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో వారిచ్చిన హమీ మేరకు ప్రజలకు ప్రభుత్వం బాకీ పడి, అప్పుల ప్రభుత్వంగా మారిందన్నారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు నారదాసు లక్ష్మణ్‌రావు, జీవీ. రామకృష్ణారావు, చల్లా హరిశంకర్ పాల్గొన్నారు.