
ఇప్పుడు బండి.. తరువాత నువ్వే..
మల్లాపూర్: పంచాయ తీ ఎన్నికల్లో భాగంగా రిజర్వేషన్ కలిసొచ్చిందని పోటీకి సిద్ధమవుతున్న ఓ వ్యక్తి బైక్‌ను ధ్వంసం చేసి ‘ఇప్పుడు బండి.. తరువాత నువ్వే..’ అంటూ అగంతకులు బెదిరింపులకు పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లిలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాధితుడి కథనం ప్రకారం గ్రామానికి చెందిన అండెం చిన్నగంగారాం, చిన్నమ్మ కుమారుడు రాజేశ్ స్థానికంగా కాంట్రాక్టు పద్ధతిన కారోబార్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్‌లో గుండంపల్లిని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాజేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 4న రాజేశ్ పొలానికి వెళ్లాడు. బైక్‌ను పార్కింగ్ చేసి పనులు చేస్తుండగా.. దుండుగులు రాజేశ్ బైక్‌ను రాళ్లతో ధ్వంసం చేశారు. ఓ పేపర్ ముక్కపై ‘ఇప్పుడు బండి.. తరువాత నువ్వే.. నువ్వు నిలబడురా..’ అని రాసిపెట్టి వెళ్లారు. విషయాన్ని స్నేహితులు, కుటుంబసభ్యులకు తెలపగా వారంతా భయాందోళన చెందుతున్నారు. భయంతోనే రాజేశ్ అస్వస్థతకు గురయ్యాడు. రాయికల్‌లో చికిత్స తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఇప్పటివరకు బాధితుడి నుంచి ఫిర్యాదు అందలేదని ఎస్సై పేర్కొన్నారు.
బైక్‌ను ధ్వంసం చేసి పేపర్‌పై రాసిన అగంతకులు
సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్న వ్యక్తికి బెదిరింపు
జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో కలకలం

ఇప్పుడు బండి.. తరువాత నువ్వే..