
మత్తు పదార్థాల అనర్థాలపై విస్త్తృత ప్రచారం
కరీంనగర్: నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెలాఖరు వరకు విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ, మత్తు పదార్థాల అనర్థాలపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లాలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై శనివారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అక్టోబర్ నెలాఖరు వరకు జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి డ్రగ్స్‌తో కలిగే అనర్థాలను వివరించాలని సూచించారు. పోలీస్, ఎకై ్సజ్, డీఆర్డీవో, మెప్మా, విద్య, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, తదితరశాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యులను చేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, మెడికల్ కళాశాలల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్య వ్యతిరేక సందేశంపై వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయాలన్నారు. మారథాన్ నిర్వహించాలన్నారు. అనంతరం నషాముక్త్ భారత్ ప్రతిజ్ఞకు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఎన్‌వైకే కో– ఆర్డినేటర్ రాంబాబు, నాకార్డ్ విభాగం సీఐ పుల్ల య్య, డీసీపీవో ఫర్వీన్, సీడీపీవో సబిత, విద్యాశాఖ కో– ఆర్డినేటర్ ఆంజనేయులు, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, ఎస్సై పాషా, నషా ముక్త్ భారత్ కమిటీ మెంబర్లు కేశవరెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు.