
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి
వీణవంక/తిమ్మాపూర్: ఇసుక లోడింగ్‌లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ప్రజా అవసరాలకు రవాణా చేయాలని తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీ ఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. శనివారం పీవో వినయ్‌తో కలిసి జిల్లాలోని వీణవంక మండలం కొండపాక బ్లాక్–1, బ్లాక్– 2 ఇసుక క్వారీలను ఆకస్మికంగా సందర్శించారు. క్వారీల్లో ఇసుక లోడింగ్ ప్రక్రియను, నిల్వలను పరిశీలించారు. ఇసుక రవాణా పత్రాలను, డిజిటల్ ట్రాకింగ్ విధానాన్ని తనిఖీ చేశారు. ఇసుక రవాణాలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను పాటించాలని స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై ఉక్కుపాదం మోపాలని హెచ్చరించారు. అంతకుముందు తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఎల్‌ఎండీ పూడిక తీత పనులను పరిశీలించారు. అన్ని అనుమతులతో పని చేయాలని ఎమోట్ డ్రెడ్గింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి సూచించారు. ఇసుక రీచ్‌ను విధిగా తనిఖీ చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. కరీంనగర్ మైనింగ్ ఏజీ వెంకటేశ్వర్లు, పెద్దపల్లి జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ రాజు, ఇరిగేషన్ ఎస్‌ఈ పెద్ది సురేశ్, తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.