
ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం .. కాపర్ చోరీ
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామగుండం కార్పొరేషన్ 21వ డివిజన్ లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపం వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను దొంగలు ధ్వంసం చేశారు. అందులోని కాపర్‌వైర్ అపహఱించారు. ఈమేరకు రైతులు మంగళవారం విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు.
వానరం దాడిలో మహిళకు గాయాలు
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలం కొమిర గ్రామంలో భారతిపై వానరం దాడిచేయడంతో గాయాలయ్యాయి. మంగళవారం ఇంటి వద్ద పనులు చేసుకుంటుండగా కోతులు అకస్మాత్తుగా దాడి చేశాయి. దీంతో మహిళ కాలికి గాయమైంది. స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంధ్రంలో డాక్టర్ షాబొద్దీన్ ఆమెకు వైద్యచికిత్స చేశారు.
గొర్లు, మేకల దొంగల పట్టివేత
రుద్రంగి(వేములవాడ): మూడు గొర్రెలు, ఒక మేకను దొంగిలించిన ఇద్దరిని పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. మంగళవారం ఉదయం రుద్రంగి పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా ఒక ట్రాలీ ఆటో కథలాపూర్ నుంచి వేములవాడ వైపు వెళ్తుండగా పెట్రోలింగ్ సిబ్బందికి అనుమానం వచ్చి ఆపేందుకు ప్రయత్నించారు. దొంగలు ఆటోను ఆపకుండా పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆటోలో మూడు గొర్రెలు, ఒక చనిపోయిన మేక ఉంది. నిందితులు వేములవాడ న్యూ అర్బన్ కాలనీకి చెందిన డ్రైవర్ వేల్పుల సురేశ్, వావిలాల అంతగిరిని విచారించగా కోరుట్లలో గొర్రెలు, మేకను దొంగిలించి వేములవాడలో అమ్మడానికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.