
ముందే దసరా ‘కిక్కు’
గాంధీ జయంతి రోజే పండుగ
మద్యం, మాంసం దుకాణాలు బంద్
ముందస్తు జాగ్రత్త పడుతున్న మద్యం ప్రియులు
ఇప్పటికే రూ.23 కోట్ల అమ్మకాలు
కరీంనగర్‌క్రైం: దసరా అంటేనే సందడి ఉంటుంది. వివిధ ప్రాంతాలకు ఉపాధినిమిత్తం వెళ్లినవారు స్వ గ్రామాలకు వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులతో సంబురాలు చేసుకుంటారు. మద్యం, మాంసం లేని దసరాను ఊహించుకోలేం. ఈ సారి దసరా గాంధీ జయంతి రోజు రావడం , అక్టోబర్ 2న మ ద్యం, మాసం దుకాణాల బంద్ నేపథ్యంలో ముందుగానే కొనుగోలు చేసిపెట్టుకుంటున్నారు. కొంతమంది దసరా ముందు రోజు లేదా తర్వాత రోజే పండుగ జరుపుకోవాలని నిర్ణయించుకుంటున్నా రు. గత వారం రోజుల నుంచే వైన్స్‌లు పెద్దఎత్తున స్టాక్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా 94 వైన్స్‌లు ఉన్నాయి. కరీంనగర్ అర్బన్‌లో 21, రూరల్ సర్కిల్‌లో 26, హుజూరాబాద్‌లో 17, జమ్మికుంట సర్కిల్‌లో 16, తిమ్మాపూర్ సర్కిల్‌లో 14 దుకాణాలున్నాయి. వైన్స్‌లకు దసరా పండక్కి పెద్దఎత్తున గిరాకీ ఉంటుంది. గాంధీ జయంతి కావడంతో గిరాకీ తగ్గే అవకాశాలున్నాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. గత వారం రోజుల నుంచి రూ.9 కోట్ల విలువైన లిక్కర్, రూ.14 కోట్ల విలువైన బీర్లు మద్యం డిపోల నుంచి వైన్స్‌లకు వెళ్లి నట్లు తెలిసింది. పండక్కి సుమారు రూ.35 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతాయని అంచనా.