
అనుమతి లేని ఫ్లెక్సీలు తొలగింపు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, బ్యానర్లు, వ్యాపార ప్రకటనలపై నగరపాలకసంస్థ చర్యలకు పూనుకుంది. పండుగలు, వ్యాపార ప్రచారంతో పాటు వివిధ సందర్భాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, బ్యానర్లు నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు నిత్యం దర్శనమిస్తున్నాయి. నగరంలోని కూడళ్లు, ప్రధాన రోడ్లలోని మెయిడిన్ల మధ్య ఫ్లెక్సీలు,బ్యానర్లు ప్రతిరోజు కనిపిస్తున్నాయి. డివైడర్ల మధ్యలోని విద్యుత్ స్థంభాలకు కూడా ఫ్లెక్సీలు కడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఫ్లెక్సీలు వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రత్యేక రోజుల్లో రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా కనిపించడం లేదు. దీంతో నగరపాలకసంస్థ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
కఠిన చర్యలు తప్పవు
పరిశుభ్రత, ట్రాఫిక్, నగర సుందరీకరణను కాపాడేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయి తెలిపారు. జంక్షన్‌లు, చౌరస్తాలు, పబ్లిక్ ప్రదేశాల్లో అనధికారికంగా బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం నిషేధమన్నారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. నగరంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను మంగళవారం నగరపాలకసంస్థ అధికారుల ఆధ్వర్యంలో డీఆర్‌ఎఫ్ సిబ్బంది తొలగించారు. జంక్షన్‌లు, చౌరస్తాల్లో కట్టిన పలు వ్యాపారసంస్థలకు మొత్తంగా రూ.15 వేలు జరిమానా విధించారు.