‘కొస’ముట్టని ప్రస్థానం | - | Sakshi
Sakshi News home page

‘కొస’ముట్టని ప్రస్థానం

Sep 23 2025 8:22 AM | Updated on Sep 23 2025 8:22 AM

‘కొస’

‘కొస’ముట్టని ప్రస్థానం

ప్రజాసమస్యలపై అజ్ఞాతం

గోపాల్‌రావుపల్లె నుంచి దండకారణ్యంలోకి..

ఆగిన 45 ఏళ్ల పోరాటం

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌ కొస మృతి

మృతదేహాలను గుర్తించని కుటుంబ సభ్యులు

సిరిసిల్ల: పీడిత.. తాడిత ప్రజల కోసం దశాబ్దాల క్రితం పోరుబాట పట్టిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఒక్కరొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, జిల్లాకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్‌ కొస అలియాస్‌ సాధు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి 45 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది.

విద్యావంతుల కుటుంబం

సత్యనారాయణరెడ్డి తండ్రి కిష్టారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి అన్నమ్మ గృహిణి. సోదరుడు కరుణాకర్‌రెడ్డి రిటైర్డు ఎంఈవో. సోదరి జయమ్మ ఇప్పటికే మరణించారు. కొస తండ్రి కిష్టారెడ్డి 2013 జూన్‌ 8న, తల్లి అన్నమ్మ 2012 నవంబరు 14న మరణించారు. తల్లిదండ్రులు మరణించినా చివరి చూపునకూ సత్యనారాయణరెడ్డి రాలేదు.

ఎక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగినా..

ప్రస్తుతం తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గింది. పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్రాల్లో ఎక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగినా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూడు కుటుంబాల్లో కలవరం మొదలవుతుంది. దండకారణ్యంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కొన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 కోట్ల రివార్డు ప్రకటించాయి. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన చంద్రయ్య అలియాస్‌ ఆజాద్‌, ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన శ్రీనివాస్‌ అలియాస్‌ భరత్‌, అలియాస్‌ యాదన్న, తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన బాలసంతుల ఉప్పలయ్య అలియాస్‌ చిన్నన్నలు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆ నలుగురిలో సత్యనారాయణరెడ్డి మరణించినట్లు పోలీసులు ప్రకటించగా.. మిగిలిన ముగ్గురు ఎక్కడ ఉన్నది వారి కుటుంబ సభ్యులకు తెలియదు. పార్టీ సైతం వారి సమాచారాన్ని బహిర్గతం చేయడం లేదు. కోనరావుపేట మండలం శివంగాళపల్లెకు చెందిన జ్యోతి అలియాస్‌ జ్యోతక్క మూడేళ్ల క్రితం పోలీసులకు లొంగిపోయారు. 20 ఏళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న జ్యోతి పోలీసులకు లొంగిపోయి స్వగ్రామంలో ఉంటోంది. బాలసంతుల ఉప్పలయ్య అలియాస్‌ చిన్నన్న మూడు దశాబ్దాలుగా ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారో తెలియదు.

ఉద్యోగం చేస్తూ ఉద్యమంలోకి..

గోపాల్‌రావుపల్లెకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి సిరిసిల్లలో ప్రాథమిక విద్యను అభ్యసించి పెద్దపల్లి ఐటీఐ పూర్తి చేశారు. బసంత్‌నగర్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరిన సత్యనారాయణ కార్మికుల హక్కుల కోసం ఉద్యమించారు. ఈక్రమంలో సిమెంట్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌ హత్యకు గురికాగా.. ఆ కేసులో జైలుకు వెళ్లాడు. జైలు నుంచి వచ్చాక అప్పటి సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస)లో పనిచేస్తూ పీపుల్స్‌వార్‌లో చేరారు. 1980 ప్రాంతంలో ఉద్యమంలోకి వెళ్లిన సత్యనారాయణరెడ్డి మావోయిస్టు పార్టీలో దాదాగా, కొసగా.. సాధు పేర్లతో కొనసాగారు.

కేంద్ర కమిటీ సభ్యులే టార్గెట్‌గా ఆపరేషన్లు

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులే టార్గెట్‌గా కేంద్ర బలగాలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస బస్వరాజ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించగా.. మరో కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు నర్సింహాచలం అలియాస్‌ సుధాకర్‌, గాజర్ల రవి అలియాస్‌ గణేశ్‌, రామచంద్రారెడ్డి అలియాస్‌ చలపతి, అలియాస్‌ జయరాం, పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న, మోడం బాలకృష్ణ మరణించారు. తాజాగా నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి, కట్ట రామచంద్రారెడ్డి అలియాస్‌ వికల్ప్‌ మరణించారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి, మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ సోనూ, కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌ ఉన్నారు.

గోపాల్‌రావుపల్లైపె నిఘా

కడారి సత్యనారాయణరెడ్డి సొంతూరు గోపాల్‌రావుపల్లైపె నాలుగు దశాబ్దాలుగా పోలీసుల నిఘా కొనసాగింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల పోలీసులు అనేక పర్యాయాలు గోపాల్‌రావుపల్లెకు వచ్చి వెళ్లారు. ఆయన పోస్టర్లను ఊరిలో ప్రదర్శించారు. సత్యనారాయణరెడ్డి తల్లి అన్నమ్మ, తండ్రి కిష్టారెడ్డి మరణించిన సందర్భాల్లోనూ పోలీసులు నిఘా పెట్టారు. 1996లో కొస వరంగల్‌ జిల్లాలో అరెస్టయి మూడునెలల జైలులో ఉండి విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. 2025 జనవరిలో రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ కొస స్వగ్రామంలో అతని సోదరుడు రిటైర్డు ఎంఈవో కరుణాకర్‌రెడ్డిని కలిశారు. కొస జనజీవన స్రవంతిలో కలిసేలా చూడాలని కోరారు.

ఫొటోలు గుర్తించని కుటుంబ సభ్యులు

కడారి సత్యనారాయణరెడ్డి ఫొటోను అతని అన్న కరుణాకర్‌రెడ్డి నిర్ధారించలేదు. అతను తమ తమ్ముడు కాదని స్పష్టం చేశారు. కానీ చాలా ఏళ్ల తరువాత తమ్ముడి ఫొటోను చూసి గుర్తించలేకపోయినట్లు భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్‌ వికల్ప్‌ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అతని భార్య మాలతి సొంతూరు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ప్రాంతానికి చెందిన రామచంద్రారెడ్డితోపాటు కొస ఎన్‌కౌంటర్‌లో మరణించడం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చర్చనీయాంశమైంది.

‘కొస’ముట్టని ప్రస్థానం1
1/3

‘కొస’ముట్టని ప్రస్థానం

‘కొస’ముట్టని ప్రస్థానం2
2/3

‘కొస’ముట్టని ప్రస్థానం

‘కొస’ముట్టని ప్రస్థానం3
3/3

‘కొస’ముట్టని ప్రస్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement