
సముద్రంలోకి ‘ఎల్లంపల్లి’ నీళ్లు
రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీరు సముద్రగర్భంలో కలవడం నీటిపారుదల శాఖ అధికారుల్లో ఆశ్చర్యం రేకెత్తిస్తుంది. ఏటా జూన్ ఒకటి నుంచి మే 31వ తేదీ మధ్య ఇరిగేషన్ ఇయర్‌గా పరిగణిస్తారు. ఈ మధ్య కురిసిన వర్షాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, ఏటా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో ఒకసారి అధిక స్థాయి, మరోసారి అల్పస్థాయిలోకి ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉంటున్నాయి. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వచ్చే వరద నీటిని గేట్ల్ల ద్వారా దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈసారి గత నాలుగు నెలల్లో అత్యధికంగా నీరు గోదావరి ద్వారా సమద్రంలో కలిసిపోయిందని అధికారులు వివరిస్తున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు వివరాలు..
ప్రాజెక్టు నీటి మట్టం 148 మీటర్లు. నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. ప్రాజెక్టులో ఆదివారం నీటిమట్టం 147.55 మీటర్లు ఉండగా, నీటినిల్వ 18.92 టీఎంసీలు ఉన్నట్లు వివరించారు. 1.57 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 1.03 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
నాలుగేళ్లలో..
– 2022–23 : ప్రాజెక్టులోకి 1,240.77 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా గేట్లు ఎత్తి 1,182.83 టీఎంసీలను గోదావరిలోకి వదిలారు.
– 2023–24 : 393.79 టీఎంసీలు ఇన్‌ఫ్లో రాగా 371.18 టీఎంసీలను నదిలోకి విడుదల చేశారు.
– 2024–25 : 329.05 టీఎంసీలు ఇన్‌ఫ్లో రాగా 276.53 టీఎంసీలను గోదావరిలోకి విడుదల చేశారు.
– 2025–26 : ఆరంభం నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు 707.82 టీఎంసీలు ఇన్‌ఫ్లో రాగా ఇప్పటివరకు 684.84 టీఎంసీలను గోదావరిలోకి విడుదల చేశారు. ఈ నీరంతా సముద్రంలో కలిసినట్లు అధికారులు అంటున్నారు.