
బాలికలను ‘స్నేహ’తో చైతన్య పరచాలి
కరీంనగర్/కరీంనగర్ అర్బన్/కరీంనగర్ కార్పొరేషన్: స్నేహ కార్యక్రమం ద్వారా 15 నుంచి 18ఏళ్ల లోపు బాలికలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చి వారికి రక్షణ, ఆరోగ్యం, విద్య, ఉపాధి తదితర విషయాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్నేహ కార్యక్రమంపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పాఠశాలల, కళాశాలల్లో చదివే కిశోర బాలికలతో పాటు గ్రామాల్లో బడి బయట ఉన్న బాలికలను గుర్తించాలని అన్నారు. వీరందరినీ గ్రూపులుగా తయారుచేసి స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సంఘాల్లోని బాలిక సభ్యులకు గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ అన్ని శాఖల అధికారులు తమ తమ పరిధిలో ఉన్న బాలికల రక్షణ, ఉపాధి, చదువు, ప్రభుత్వాలు పథకాలు, కార్యక్రమాలు తదితర రంగాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే ఉత్తమ ఫలితాలు సాధించిన మహిళా స్వయం సహాయక సంఘాలతో ఈ బాలిక సంఘాలను అనుసంధానించాలని పేర్కొన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమం, మెప్మా, పోలీస్, విద్య, వైద్య తదితరశాఖలు వీరికి సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. అడిషనల్ డీఆర్డీవో రవికుమార్, మెప్మా పీడీ స్వరూపారాణి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీపీవో జగదీశ్వర్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్, నెహ్రు యువకేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు పాల్గొన్నారు.
బధిరులకు శిక్షణ ఇవ్వాలి
బధిరులకు మరిన్ని నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా యంత్రాంగం, అక్షయ ఆకృతి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌పై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర వర్గాలకు రెండోదశ శిక్షణ ముగిసింది. ఈ కోర్స్ పూర్తి చేసుకున్న వారికి శనివారం నగరపాలకసంస్థ కార్యాలయంలో సర్టిఫికెట్లు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ బధిరుల్లో మంచి ప్రతిభ ఉందన్నారు. వారికి చేయూతనిచ్చి, వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఆర్ట్, క్రాఫ్ట్, బుక్ బైండింగ్, ఫోటో పెయింట్ వంటి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తే భవిష్యత్తులో మరింత రాణించగలరని తెలిపారు. ఉన్నతాధికారులు సైన్ లాంగ్వేజీ నేర్చుకునేందుకు ఆన్‌లైన్ శిక్షణా తరగతులు ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలన్నారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ప్రాంతీయ శిక్షణ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు, బధిరుల పాఠశాల ప్రిన్సిపాల్ కమల, అక్షయ ఆకృతి ఇన్‌స్ట్రక్టరు్‌ల్ శైలజ, ధరణి, పర్సిస్, మణి పాల్గొన్నారు.

బాలికలను ‘స్నేహ’తో చైతన్య పరచాలి