
ముస్తాబైన మహాశక్తి ఆలయం
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్ చైతన్యపురిలోని మహాశక్తి ఆలయం దేవీ శరన్నవరాత్రోత్సవాలకు ముస్తాబైంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఆలయానికి వచ్చే దారులు వివిధ దేవతల రూపంలో ఏర్పాటు చేసిన కటౌట్లు విద్యుద్దీపాల వెలుగులతో విరాజిముతున్నాయి. ఏటా ఇక్కడే భవానీ దీక్షలు తీసుకుని నవరాత్రుల అనంతరం విరమిస్తారు. ఆలయంలో తొమ్మిదిరోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 22న శ్రీ బాలాత్రిపుర సుందరిదేవీ (శైలపుత్రి) అవతారంలో అ మ్మవారు దర్శనం ఇస్తారు. 23న శ్రీగాయత్రీ దేవి (బ్రహ్మచారిని) అవతారం, 24న బుధవారం శ్రీ అన్నపూర్ణ దేవి (చంద్ర ఘంట) అవతారం, 25న గురువారం ఉదయం 8 గంటలకు శ్రీ కాత్యాయని దేవి(కూష్మాండ ), 26న శ్రీ మహాలక్ష్మి దేవి (స్కందమాత), 27న శ్రీ లలితా దేవి (కాత్యాయని), 28న శ్రీ మహా చండీదేవి (కాళరాత్రి), 29న శ్రీ సరస్వతి దేవి (మహాగౌ రీ), 30న శ్రీ దుర్గాదేవి (సిద్ధిరాత్రి),, అక్టోబర్ 1న శ్రీ మహిషాసుర మర్ధిని, 2న శ్రీ రాజరాజేశ్వరి దేవీగా దర్శనం ఇవ్వగా.. విజయదశమి శమీ పూ జ నిర్వహిస్తారు. ప్రతీరోజు రాత్రి 9 గంటలకు దాండియా కార్యక్రమం నిర్వహించనున్నారు.

ముస్తాబైన మహాశక్తి ఆలయం