
ఆదాయ వనరుల గుర్తింపు
కరీంనగర్‌రూరల్: కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల సర్వేను చేపట్టాలని నిర్ణయించింది. గ్రామపంచాయతీల వనరుల వివరాలను డీఆర్‌ఎస్ యాప్‌లో నమోదు చేయాలనే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శులు గురువారం నుంచి గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. శుక్రవారం డీపీవో జగదీశ్వర్ చామనపల్లిలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై సర్వేను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తుండగా కొత్తగా మౌలిక సదుపాయాల సర్వేతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
యాప్‌లో నమోదు చేసేవి
పంచాయతీ కార్యదర్శులు గ్రామంలోని 22అంశాలకు సంబంధించిన వివరాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, హెల్త్‌సెంటర్లు, గ్రంథాలయం, రైతువేదిక, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాల సేకరణ కేంద్రం, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, కంపోస్టుషెడ్, వైకుంఠధామం, క్రీడా ప్రాంగణం, స్వశక్తి మహిళా సంఘాలు, స్ట్రీట్‌లైట్లు, నల్లాలు, బోర్లు, మోటార్లు, డ్రైనేజీలు, రోడ్లు, ఇంకుడుగుంతలు, ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్ల వివరాలను నమోదు చేస్తున్నారు. సేకరించిన వివరాలను ఎంపీడీవో యాప్‌కు పంపిస్తున్నారు. సర్వే నిర్వహించడం ద్వారా గ్రామాల్లో ఉన్న వసతుల వివరాలు కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. ఆయా గ్రామాల్లో ఏయే వసతులున్నాయి, ఇంకా ఏమేం అవసరమో తెలిసే అవకాశముంది.