
హామీ ఇచ్చారు.. సౌకర్యాలు మరిచారు
కరీంనగర్/కరీంనగర్ కార్పొరేషన్: ‘ప్రభుత్వ వెంచర్ అని నమ్మాం. రూ.లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేశాం. అభివృద్ధికి దూరమై అవస్థలు పడుతున్నాం. గత కలెక్టర్ హామీ ఇచ్చి.. సౌకర్యాలు కల్పించడం మరిచారు’ అని తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో ఏర్పాటు చేసిన అంగారికా టౌన్‌షిప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు రఘుశంకర్‌రెడ్డి మాట్లాడుతూ మూడేళ్లక్రితం ప్లాట్లు వేలం వేసిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు టౌన్‌షిప్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారన్నారు. 85 ఎకరాల్లో 819 నివాస ప్ల్లాట్లుచేసి విక్రయించి, రూ.147 కోట్లు స ర్కారు గడించిందన్నారు. గతంలో ఇచ్చిన ఒక్కహామీ అమలు చేయలేదన్నారు. జిల్లా మంత్రులు జోక్యం చేసుకొని టౌన్‌షిప్‌లో సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డిని కలిశారు. నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ అంగారక టౌన్ షిప్ ప్లాట్ల వేలం ద్వారా వచ్చిన రూ.150 కోట్లు గత ప్రభుత్వం వాడుకుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టౌన్‌షిప్‌పై దృష్టి సారించామన్నారు. రూ.2 కోట్లతో అంతర్గత రోడ్లు ఫార్మేషన్ చేశామని తెలిపారు. రూ.20 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు.