
పనులు త్వరగా పూర్తి చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశించారు. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ, అగ్రిమెంట్లు త్వరగా చేపట్టాలన్నారు.అసంపూర్తి పనులు పూర్తి చేయాలన్నారు. ఎస్‌ఈ రాజ్ కుమార్, ఈఈలు రొడ్డ యాదగిరి, సంజీవ్ కు మార్, డీఈలు లచ్చిరెడ్డి, ఓం ప్రకాశ్, శ్రీనివాస్ రావు, వెంకటేశ్వర్లు, ఏఈలు పాల్గొన్నారు.
విద్యానగర్(కరీంనగర్): బతుకమ్మ, దసరా పండుగలకు కరీంనగర్ నుంచి జేబీఎస్ వరకు ఈనెల 29 నుంచి అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు శుక్రవారం తెలిపారు. జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు ఈనెల 20నుంచి అక్టోబర్ 1వరకు 1,321 బస్సులు, కరీంనగర్ నుంచి జేబీఎస్‌కు అక్టోబర్ 2 నుంచి 13వ తేదీ వరకు 1,330 బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉందని, ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లు రిజర్వు చేసుకోవాలన్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సులు ఏర్పాటు చేయాలని అన్ని డిపో మేనేజర్లను ఆదేశించారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్లుఎస్. భూపతిరెడ్డి, పి.మల్లేశం పాల్గొన్నారు.
జమ్మికుంట: రైల్వే కార్మికులకు 8వ వేతన కమిటీ ఏర్పాటు చేసి, వేతన పే కమిషన్ అమలు చేయాలని రైల్వే మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ చైర్మన్ ఉప్పుల రాజయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం జమ్మికుంట రైల్వేస్టేషన్ ఎదుట రైల్వే కార్మికులు అందోళన నిర్వహించారు. రైల్వేశాఖలో కనీస వేతనాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. 2026 జనవరి నుంచి వేతన పే కమిషన్ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ శ్రీనివాస్, కోశాధికారి సాంబరాజు, అసిస్టెంట్ సెక్రటరీ బీస మొండయ్య, కుమారస్వామి, రమేశ్ పాల్గొన్నారు.
చిగురుమామిడి: గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు మంచి మేలుజాతి పాడిపశువులను ఎంచుకోవాలని, తద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుందని జిల్లా పశుసంవర్ధకశాఖ సంచాలకుడు ఎన్.లింగారెడ్డి సూచించారు. మండలంలోని సుందరగిరి గ్రామంలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. 78 పాడి పశువులకు మందులు పంపిణీ చేశారు. పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్‌కుమార్, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్యఅధికారి డాక్టర్ సత్యప్రసాదరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ జి.రాజిరెడ్డి, కరీంనగర్ శిక్షణా కేంద్రం డాక్టర్లు ఏ.కోటేశ్వర్‌రావు, సాయి చైతన్య, దివ్య పాల్గొన్నారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: కొత్త డీటీఆర్ లైన్ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.శ్రీరాంనగర్ ఫీడర్ పరిధిలోని శ్రీరాంనగర్, శాతవాహన యూనివర్సిటీ, సాలంపుర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. విద్యుత్‌త్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపు పనులు, సబ్‌స్టేషన్‌లో నిర్వహణపనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొత్తపల్లి, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొగ్ధుంపూర్, ఇరుకుల్ల, నల్లకుంటపల్లి, మందులపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.

పనులు త్వరగా పూర్తి చేయాలి

పనులు త్వరగా పూర్తి చేయాలి