దుబాయ్‌ వెళ్లేందుకు మరొకరు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ వెళ్లేందుకు మరొకరు సిద్ధం

Sep 11 2025 2:57 AM | Updated on Sep 11 2025 2:57 AM

దుబాయ

దుబాయ్‌ వెళ్లేందుకు మరొకరు సిద్ధం

● ‘సెల్‌ఫోన్‌ విషయంలో తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు అని ఓ మహిళ వన్‌టౌన్‌ మెట్లెక్కితే.. నిందితులు ఎన్నారైలని తెలిసి వారితో చేతులు కలిపిన పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో వారి పేర్లు తప్పించారు. ఫలితంగా మరునాడే నిందితులు అమెరికాకు చెక్కేశారు’. ● ‘తమను రూ.54 లక్షలకు క్రిప్టో కరెన్సీ పేరుతో మోసం చేశారంటూ బాధితులు టూటౌన్‌ గడప తొక్కితే.. దర్యాప్తులో తాత్సారం వల్ల నిందితులు పక్క రాష్ట్రం పారిపోయారు. మరో వ్యక్తి దుబాయ్‌ వెళ్లేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు’. ఇదీ.. కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌లో దర్యాప్తు అధికారులు వ్యవహరిస్తోన్న తీరు. కేసులో నిందితులు ఉన్నత సామాజికవర్గాలు, ఆర్థికంగా బలంగా ఉంటే.. బాధితుల వైపు కాకుండా.. నిందితులకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలుగుచూస్తున్న కేసుల్లో అరెస్టును తప్పించుకునేందుకు నిందితులు పొరుగు దేశాలు, రాష్ట్రాలకు పారిపోతుండడం పోలీసులపై వస్తోన్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సంప్రదాయం ‘లా అండ్‌ ఆర్డర్‌’ పోలీసులకే పరిమితం కాలేదు.. సీఐడీ, ఏసీబీ అధికారులు కూడా నిందితులతో కుమ్మక్కవుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. కనీసం పరారైన నిందితులపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌వోసీ) నోటీసులు సకాలంలో జారీ చేయలేకపోతున్నారు. ఒకవేళ అదే నిందితులు మరో రాష్ట్రంలో నేరాలు చేసి దొరికితే ఇతర రాష్ట్రాలు అప్పటికే ఎల్‌వోసీ జారీ చేయడం వల్ల మన రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయలేకపోతున్నారు.

విదేశాలకు పారిపోతున్న నిందితులు కేసు నమోదు, దర్యాప్తులో జాప్యమే కారణం జీబీఆర్‌ క్రిప్టోలో దుబాయ్‌ వెళ్దామనుకున్న సూత్రధారి మెటా క్రిప్టోలో థాయ్‌లాండ్‌, విజయవాడకు.. మహిళపై దాడి కేసులో అమెరికాకు నిందితులు జంప్‌ తీవ్రంగా స్పందించిన సీపీ గౌస్‌, లుక్‌ అవుట్‌ నోటీసులకు ఆదేశం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

జనవరి నుంచి పలు కేసుల్లో..

జీబీఆర్‌ క్రిప్టో కరెన్సీ పేరిట కరీంనగర్‌ కేంద్రంగా ఈ ఏడాది జనవరిలో వెలుగుచూసిన రూ.95 కోట్ల స్కాంలో నిందితుడు రమేశ్‌గౌడ్‌ దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధపడ్డాడు. ఇక్కడ వసూలు చేసిన డబ్బులతో దుబాయ్‌లో ప్లాటు కొని, పదేళ్ల వీసా సంపాదించాడు. ఇంతలో రమేశ్‌గౌడ్‌ కరీంనగర్‌ సీఐడీ డీఎస్పీ కుమ్మక్కయ్యారని, బాధితులు సీఐడీ చీఫ్‌కు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. అప్పటి కరీంనగర్‌ సీఐడీ డీఎస్పీని అదే రోజు డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. వెంటనే రమేశ్‌గౌడ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఏసీబీ నుంచీ లీక్‌..

ఆగస్టు చివరి వారంలో బల్దియాలో ఓ అవినీతి తిమింగళంలా పేరొందిన అధికారిని వేటాడేందుకు ఏసీబీ వలపన్నింది. అయితే, స్థానికంగా ఉన్న కొందరు అధికారులు ముందే ఈ సమాచారాన్ని సదరు అధికారికి లీక్‌ చేశారు. దీంతో సదరు అధికారి ఆ రోజు ఏసీబీకి చిక్కకుండా ఊరొదిలి పారిపోయాడు.

అమెరికాకు పరారై ..

వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి..

తాజాగా ఈనెల 3న వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ మహిళపై దాడి కేసులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. మహిళపై మరో మహిళ, నలుగురు పురుషులు దాడి చేశారు. ఈ దాడిలో మహిళ దంతాలు రాలిపోయి, చేతివేళ్లు విరిగాయి. కంటికి, ఒంటికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన వారిలో ఇద్దరు పురుషులు ఎన్నారైలు. వారిద్దరూ దేశం వదిలి పారిపోతారని చెప్పినా.. కనీసం ఎఫ్‌ఐఆర్‌లో వారి పేర్లు కూడా ప్రస్తావించలేదు. ఫలితంగా 9న అర్ధరాత్రి నిందితులిద్దరూ అమెరికాకు పారిపోయి, వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టడం గమనార్హం. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారాయని బాధితులు ఆరోపిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులను సైతం పరిగణనలోకి తీసుకోకపోవడంపై కాలనీ మొత్తం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై సీపీ గౌస్‌ ఆలం సీరియస్‌ అయ్యారు. టౌన్‌ ఏసీపీని పిలిపించి వివరణ కోరారు. అమెరికా పారిపోయిన వారిపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

థాయ్‌లాండ్‌ ట్రాఫికింగ్‌ విషయంలో..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన థాయ్‌లాండ్‌ కేంద్రంగా వెలుగుచూసిన సైబర్‌ కేఫ్‌ ట్రాఫికింగ్‌ కేసులో పోలీసులు సరైన కాలంలో లుక్‌అవుట్‌ నోటీసు సర్క్యులర్‌ జారీ చేయలేకపోయారు. దీంతో నిందితుడిని ఢిల్లీలోని ఏపీ హౌజ్‌లో గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధపడ్డారు. ఆ సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ జోక్యంతో నిందితుడిని కరీంనగర్‌కు తీసుకువచ్చారు.

మెటా ఫండ్‌ పేరిట కరీంనగర్‌ కేంద్రంగా మరో క్రిప్టో స్కాం వెలుగుచూసింది. రోజూ లాభాలు వస్తాయని ఆశపెట్టడంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేశారని ప్రచారం జరగుతోంది. ఈ కేసులో టూటౌన్‌, రూరల్‌, కొత్తపల్లిలో బాధితులు ఫిర్యాదు చేసినా.. పోలీసులు తాత్సారం చేశారు. పైగా నిందితులతో సెటిల్‌ చేసుకోవాలని బాధితులకు ఉచిత సలహా ఇచ్చి పంపారు. ఎట్టకేలకు జూలైలో దాసరి రమేశ్‌, దాసరి రాజుపై కేసు నమోదైంది. పోలీసుల నిర్లక్ష్యం అదునుగా చేసుకుని నిందితులు విజయవాడకు పరారై ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన లోకేశ్‌ థాయ్‌లాండ్‌ పారిపోయాడని ప్రచారం జరుగుతోంది. ఇంకో నిందితుడు సతీశ్‌ దుబాయ్‌లో ఇప్పటికే పలు పెట్టుబడులు పెట్టి దేశం వదిలిపారిపోయేందుకు సిద్ధంగా ఉండటం కొసమెరుపు.

దుబాయ్‌ వెళ్లేందుకు మరొకరు సిద్ధం 1
1/2

దుబాయ్‌ వెళ్లేందుకు మరొకరు సిద్ధం

దుబాయ్‌ వెళ్లేందుకు మరొకరు సిద్ధం 2
2/2

దుబాయ్‌ వెళ్లేందుకు మరొకరు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement