
పార్క్‌పై బల్దియా విచారణ
సాక్షిప్రతినిధి,కరీంనగర్: నగరంలో వివాదాస్పదంగా మారిన మల్ట్టీపర్పస్ పార్క్ గలీజు దందాపై అధికారులు విచారణ మొదలు పెట్టారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశాల మేరకు సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో డీఈ వెంకటేశ్వర్లు, ఏసీపీ వేణు, ఏఈ సతీష్, టీపీబీవో నవీన్‌ల బృందం బుధవారం పార్క్‌ను సందర్శించింది. నగరపాలక సంస్థతో కుదుర్చుకున్న లీజు ఒప్పంద ఉల్లంఘనపై అధికారులు దృష్టిపెట్టారు. పార్క్‌లో టికెట్ ధరలు, వాకింగ్ ట్రాక్ దుర్వినియోగం, దాబాను ప్రారంభించడం లాంటి అంశాలు పరిశీలించారు. కాగా.. లీజు ఒప్పందం మేరకు పార్క్‌లోకి ప్రవేశ రుసుం రూ.20 ఉండగా, నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వీకెండ్స్‌లో రూ.50 వసూలు చేస్తుండడం తెలి సిందే. అయితే రూ.50 టికెట్‌లకు సంబంధించిన బుక్‌లు ఎక్కడా అధికారులకు దొరకకుండా జాగ్రత్త పడ్డట్లు సమాచారం. కాగా... పార్క్‌లో వి చారణ చేపట్టిన అధికారుల బృందం గురువారం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్‌కి నివేదిక అందించనుంది. ఆ నివేదిక ఆధారంగా కమిషనర్ చర్యలు తీసుకోనున్నారు.
దాబా...కంటిన్యూ
మల్ట్టీపర్పస్ పార్క్‌లో లీజు ఒప్పందాలకు తూట్లుపొడుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకుల తీరుపై సర్వత్రా విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. వారి తీరులో మాత్రం ఇసుమంత మార్పుకూడా కనిపించడం లేదు. అధికారులు నోటీసులు ఇస్తున్నా.. విచారణచేపడుతున్నా...మరో వైపు మాత్రం నిర్వాహకులు దాబాను కొనసాగించడం వారి లెక్కలేనితనాన్ని తెలియజేస్తోంది. విచారణ, నోటీసులతో అయ్యేదేమీ లేదని, షరామామూలుగానే దాబా నడిపించడమేననే ధీమా వారిలో ఉంది. మరి నగరపాలకసంస్థ ఉన్నతాధికారులు ఏంచేస్తారో వేచి చూడాలి.
గలీజ్ దందా పార్ట్– 3