
ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం
కరీంనగర్: వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ రోడ్డు చౌరస్తాలో గల విగ్రహానికి సుడా చైర్మన్, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా, హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన సాహస వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా శక్తికి ఐలమ్మ ఒక నిదర్శమని పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి అనిల్ ప్రకాశ్, రజక సంక్షేమ సంఘాల నాయకులు కొత్తకొండ రాజయ్య, రాచకొండ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ విద్యాలయంగా శాతవాహనకు గుర్తింపు
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ 2008లో స్థాపించబడి ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ విద్యాలయంగా గుర్తించబడుతుందని వీసీఉమేశ్‌కుమార్ అన్నారు. యూనివర్సిటీ గురించి ప్రపంచానికి తెలిసేలా తన పర్యటన కొనసాగిందని వివరించారు. ఇటీవల అమెరికా పర్యటన వివరాలను బుధవారం వెల్లడించారు. శిక్షణ, పరిశోధన, విద్యారంగంలో మెరుగైన అవకాశాలకు ఎన్‌ఆర్‌ఐ సాయం కోసం అమెరికాలోని 7 ప్రముఖ నగరాలను సందర్శించి రూ.అర కోటికి పైగా విరాళాలు సేకరించినట్లు తెలిపారు. సాంకేతిక అభివృద్ధి కోసం కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు అందజేసేందుకు ఎన్‌ఆర్‌ఐలు ముందుకొచ్చినట్లు తెలిపారు. నవంబర్ రెండోవారంలో విశ్వవిద్యాలయంలో 2వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
‘సేవాపక్షం’ విజయవంతం చేయాలి
తిమ్మాపూర్/కరీంనగర్ టౌన్: బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి చేపట్టనున్న సేవా పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, సేవా పక్షం రాష్ట్ర కన్వీనర్ మల్క కొమురయ్య పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, సేవా పక్షం జిల్లా కన్వీనర్ ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బాస సత్యనారాయణ, వై.సునీల్‌రావు, డి.శంకర్, గుగ్గిల రమేశ్, వాసాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల రక్షణచట్టం అమలు చేయాలి
కరీంనగర్‌క్రైం: న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను లాయర్లు డిమాండ్ చేశారు. ఇటీవల మేడ్చల్, ఖమ్మం, ఆదిలాబాద్ బార్ అసోసియేషన్‌ల సభ్యులు సురేశ్‌బాబు, ఎండీ జహీర్ అలీ, ఇజ్జగిరి మనోజ్‌పై జరిగిన దాడులను నిరసిస్తూ బుధవారం కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లింగంపల్లి నాగరాజు, కందుల అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతుందన్నారు. అనంతరం జిల్లా కోర్టు నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి డీఆర్‌వోకు వినతిపత్రం అందించారు. సీనియర్ న్యాయవాదులు కుసుంబ కృష్ణారావు, కొరివి వేణుగోపాల్, బి.రాంరెడ్డి, పి.బాపురావు, వినయ్, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం

ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం

ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం