
దివ్యాంగుల సంక్షేమానికి కృషి
తిమ్మాపూర్: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఎల్‌ఎండీ కాలనీలోని స్వాతంత్ర సమర యోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మానసిక వికలాంగుల పాఠశాలలో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సిద్దిపేట శాఖ నేత్ర వైద్య శిబిరం బుధవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలను ఉన్నతం చేయడంతోపాటు వారికి జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. దివ్యాంగుల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.50 కోట్లు వెచ్చించినట్టు మంత్రి వెల్లడించారు. తాను మంత్రి అయిన తర్వాత కరీంనగర్‌లోని మానసిక వికలాంగుల పాఠశాలకు సహాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరినట్టు గుర్తు చేశారు. పాఠశాల సిబ్బంది జీతభత్యాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తనకు మంత్రివర్గంలో చోటు దక్కడంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కృషి ఉందన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, దివ్యాంగులను ప్రేమతో ఆదరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి ప్రభుత్వంతోపాటు సేవా సంస్థలు, దాతలు ముందుకు రావాలని కోరారు. మానసిక వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ, దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా దివ్యాంగులు ఉన్నారని, బాలభరోసా కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలోపు దివ్యాంగ పిల్లలను గుర్తించి,చికిత్స అందిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.