
బతుకమ్మ చీరలు
కరీంనగర్ అర్బన్: బతుకమ్మ పండుగకు చీరలొస్తున్నాయి. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక పేరిట మహిళలకు చీరలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వివిధ డిజైన్లలో చీరలను తయారు చేయగా.. ఒక్కో మహిళకు 2 చీరలు పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ చేపట్టగా.. గత సంవత్సరం చీరల పంపిణీకి బ్రేక్ పడింది. తా జాగా చీరల పంపిణీకి శరవేగంగా సన్నాహాలు సాగుతున్నాయి.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. అతి వలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఎంగిలి పూల నాటి నుంచి మహిళలు చేసే సందడి కనుల విందే. ఉదయం వేళలో పూలు తేవడం.. బొడ్డెమ్మలను పేర్చడం.. సాయంత్రం వేళలో పాటల కోలాహలంతో బతుకమ్మను కీర్తించడం ప్రతీతి. జిల్లాలోని లోగిళ్లలో చిన్నారుల నుంచి మహిళా వృద్ధుల వరకు పండుగ వాతావరణం తొణికిసలాడుతుంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్, రంజాన్ పండుగలకు దుస్తులు పంపిణీ చేసినట్లే.. బతుకమ్మకు అత్యంత ప్రా ధాన్యమిస్తూ ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోంది.
వివిధ రకాల డిజైన్లు
గతానికి భిన్నంగా చీరలను తయారు చేయించారని అధికారులు చెబుతున్నారు. ఒక్కో చీరకు సుమారు రూ.500కు పైగా ఖర్చు కాగా.. మగువల మనసు దోచేలా పలు రకాల డిజైన్లను జోడించారు. బంగారు, వెండి జరి అంచు చీరలు, చెక్స్ డిజైన్లు ఈసారి ప్రత్యేకమని అధికారులు చెబుతున్నారు. అయితే చీరల పంపిణీ ఎపుడన్నది ఇంకా సందిగ్ధమే. ఈనెల 21 నుంచి ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభం కానుండగా.. వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈనెల మూడో వారంలో పంపిణీ చేస్తారని తెలుస్తుండగా.. ఎవరు అందజేస్తారన్నది తేలాల్సి ఉంది.
నేడో, రేపో రానున్న చీరలు
గతంలో రెవెన్యూ డివిజన్లవారీగా చీరలను వేరు చేసి మండలాలవారీగా సరఫరా చేయగా.. అక్కడి రేషన్ దుకాణాల డీలర్లు వారివారి జాబితా ప్రకారం చీరలను తీసుకొని పంపిణీ చేశారు. 2023లో గ్రామాల్లో ఐకేపీ సంఘాలు, పట్టణాల్లో మెప్మా సంఘాలు పంపిణీ చేశాయి. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, పంచాయతీ సిబ్బంది సభ్యులుగా వ్యవహరించారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి చీరలను పంపిణీ చేశారు. ఆహార భద్రత కార్డులో పేరుండి 18 ఏళ్లు నిండిన మహిళలకు గతంలో చీరలను పంపిణీ చే యగా.. జిల్లాలో 2.72లక్షల కార్డుదారులకు అందజేశారు.
గత ప్రభుత్వంలో సదరు ప్రక్రియలో పంపి ణీ జరగగా.. తాజాగా జిల్లావ్యాప్తంగా పట్టణ, గ్రా మీణ ప్రాంతాల్లో 18 ఏళ్లు నిండిన స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు డీఆర్డీవో శాఖ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నారు. నేడో, రేపో కలెక్టరేట్‌కు చీరలు రా నుండగా.. అక్కడి నుంచి మండలాలు, గ్రామాలకు చేరనున్నాయి. వచ్చేవారం గ్రామాలు, పట్టణాల్లోని మహిళలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. సంఘాల్లో ఉన్న సభ్యులకు రెండేసి చొప్పున పంపిణీ చేస్తారా.. రెండో విడతలో మరికొన్ని తెప్పిస్తారా అన్నది స్పష్టత లేదు. ప్రభుత్వ ఆదేశాల క్రమంలో పంపిణీ జరుగుతుందని డీఆర్డీవో విభాగ అధికారులు వివరించారు.
జిల్లాలో మొత్తం సంఘాలు: 13,748
సభ్యులు: 1,47,723
వీవో సంఘాలు: 527
మండల సమాఖ్యలు: 16
జిల్లా సమాఖ్య: 1
రేషన్ దుకాణాలు: 566
ఆహార భద్రత కార్డులు: 2,78,199
మొత్తం యూనిట్లు: 8.98,212
18 ఏళ్లు నిండిన మహిళలు: 2.52లక్షలు