
ఎంపీటీసీ, జెడ్పీటీసీ తుది ఓటర్ల జాబితా ప్రకటించిన అధికారులు
మహిళా ఓటర్లు 2,60, 388
పురుష ఓటర్లు 2,47, 131
ఇతరులు 12
కరీంనగర్: జిల్లాలోని 15 మండలాల్లో 170 ఎంపీటీసీ స్థానాలు, 15 జెడ్పీటీసీ స్థానాల పరిధిలోని ఓటర్ల తుదిజాబితాను బుధవారం రాత్రి జెడ్పీ సీఈవో శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లోని ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శించారు. జిల్లాలోని 313 గ్రామపంచాయతీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితాను జిల్లా యంత్రాంగం ప్రదర్శించింది.
జిల్లా యంత్రాంగం ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 5,07,531 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళ ఓటర్లు 2,60, 388 కాగా పురుష ఓటర్లు 2,47, 131, ఇతరులు 12 మంది ఉన్నారు. 934 పోలీసు స్టేషన్‌ల వారీగా జాబితాను వెల్లడించారు. ఇందులో 500లోపు జనాభా ఉన్న గ్రామాల్లో 343 పోలింగ్ కేంద్రాలు, 501 నుంచి 700 వరకు జనాభా ఉన్న గ్రామాల్లో 591 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు.
ఈనెల 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ముసాయిదా జాబితాను మండల పరిషత్‌లో ప్రదర్శించారు. ఈనెల 8న జిల్లాస్థాయి, మండలస్థాయిల్లో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించారు. 8,9 వ తేదీల్లో అభ్యంతరాలపై దరఖాస్తుల స్వీకరించి సమస్యలు పరిష్కరించి బుధవారం రాత్రి తుది జాబితా ప్రకటించారు.