ఇదేం గలీజు దందా! | - | Sakshi
Sakshi News home page

ఇదేం గలీజు దందా!

Sep 9 2025 1:39 PM | Updated on Sep 9 2025 1:39 PM

ఇదేం

ఇదేం గలీజు దందా!

వేసవిలో ‘చిట్టడివి’ని సృష్టించారంట

బల్దియా పార్కులో

అను‘మతి లేని రెస్టారెంట్‌’

ప్రజల వినోదానికి ఏర్పాటు చేసిన పార్క్‌లో ఫుడ్‌ బిజినెస్‌

టికెట్‌ పెట్టి ఎంట్రీ ఫీజు రూ.50 వరకు వసూలు

కరీంనగర్‌ బల్దియా నిర్లక్ష్యం.. చెలరేగుతున్న లీజుదారులు

పార్కులో 5000 మొక్కలు నాటి, అడవిని సృష్టించామంటూ గొప్పలు

బల్దియా వీరికి పార్కు ఇచ్చిందా? స్థలమిచ్చిందా? అని వాకర్స్‌ ప్రశ్న

సాయంత్రానికి రెస్టారెంట్‌కు అనుమతి లేదన్న ఎంసీకే కమిషనర్‌

సాక్షిని అడ్డుకునే యత్నం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ :

రీంనగర్‌లో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన మల్టీపర్పస్‌ పార్కును ఇష్టానికి వినియోగిస్తున్నారు. పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం, అనుమతి లేకున్నా రెస్టారెంట్లు, దాబాలు ఏర్పాటు చేస్తూ హడావుడి చేస్తున్నారు. ఈ దందాలో మాజీ కార్పొరేటర్లు భాగస్వాములు కావడంతో బల్దియా అధికారులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. ఈ విషయమై సోమవారం ‘సాక్షి’ వివరణ కోరడంతో రంగంలోకి దిగిన కమిషనర్‌ అసలు మల్టీపర్పస్‌ పార్కులో రెస్టారెంట్‌కు ఎలాంటి అనుమతి లేదని, రద్దు చేస్తామని తొలుత తెలిపారు. రాత్రి 8.30 గంటల తరువాత ఇదే విషయాన్ని అధికారికంగా మాట్లాడారు. వినోదం కోసం ఏర్పాటుచేసిన పార్కులో ప్రజల జేబులకు చిల్లుల పడేలా వ్యవహరిస్తున్న మాజీ కార్పొరేటర్లు, వారితో కుమ్మక్కయిన బల్దియా అధికారులు కలిసి ఇంతకాలం చేసిన ఈ వ్యవహారం కమిషనర్‌ జోక్యంతో ముగిసినట్లయింది.

అసలేం జరిగింది?

కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో చేపట్టిన మల్టీపర్పస్‌ పార్కు నిర్మాణం ఆదినుంచి వివాదాల నడుమే సాగింది. నిర్మాణంలో సుదీర్ఘ జాప్యం జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఒప్పందం ప్రకారం నిర్మించిన కాంట్రాక్టరు మూడేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు చూడాలి. అతన్ని కాదని మరో కాంట్రాక్టరుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. తరువాత ఓ మాజీ కార్పొరేటర్‌ భాగస్వామిగా ఉన్న సంస్థకు లీజుకిచ్చారు. ఈ లీజు చెల్లదంటూ పలువురు మాజీ కార్పొరేటర్లు ఫిర్యాదులు చేసినా బల్దియా వర్గాలు పట్టించుకోలేదు. పార్కులో ప్రవేశానికి రూ.20 ఎంట్రీ ఫీజు వసూలు చేయడం ప్రారంభించారు. దీనిపై విమర్శలు వచ్చినా.. భాగస్వాముల్లో మాజీ కార్పొరేటర్‌ ఉండటంతో బల్దియా అధికారులు కిమ్మనలేదు. తరువాత ఈ ఫీజును వారాంతాల్లో రూ.50కి పెంచారు. ఒప్పందంలో రూ.50ఫీజుగా తాము నిర్ణయించలేదని కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ ‘సాక్షి’కి స్పష్టం చేశారు. ఈ లెక్కన వారంతాల్లో రూ.50 చొప్పున వసూలు చేసిన అధికఫీజు ఎవరి జేబులోకి వెళ్లింది అనేది ప్రశ్నార్థకంగా మారింది. అది చాలదన్నట్లుగా ఇక్కడ రెస్టారెంట్‌ ప్రారంభించారు. వాస్తవానికి మున్సిపల్‌ పార్కుల్లో చిప్స్‌ తదితర ప్యాక్డ్‌ ఫుడ్‌ విక్రయించాలి. అక్కడే ఆహారం వండితే పొగ, కూరగాయల వ్యర్థాలతో వాకర్స్‌కు ఇబ్బంది కలుగుతుంది. ఎలకలు పందికొక్కులు వచ్చి మొక్కలను నాశనం చేస్తాయి. నగరవాసులకు ఆహ్లాదం కోసం నిర్మించిన పార్కు లక్ష్యం కాస్తా.. పక్కదారి పడుతోంది. ప్రస్తుతం లీజుకు తీసుకున్న నిర్వాహకులు బల్దియా అధికారులతో ఉన్న పాత పరిచయంతో రెస్టారెంట్‌ నిర్మాణం ప్రారంభించారు.

లీజుకు తీసుకున్న వారు వాకర్స్‌కు ఆహారం అందిస్తామంటూ మున్సిపల్‌ కమిషనర్‌కు పెట్టుకున్న దరఖాస్తు వింతగా ఉంది. వారు పార్కును ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రెండేళ్ల కాలానికి లీజుకు తీసుకుని అభివృద్ధి చేశామని, వేసవికాలంలోనూ పార్కులో 5000 మొక్కలు నాటామని, చిన్నపాటి అడవిని సృష్టించామని, ఆక్సిజన్‌ జోన్‌గా మార్చామని చెప్పుకున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.50 లక్షలు ఖర్చు చేశారంట. అందుకే, సందర్శకుల తాకిడి పెరిగి ఆహారం అందించాలని పట్టుబడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. కాబట్టి రెస్టారెంట్‌కు అనుమతి కావాలంటూ 6వ తేదీన కమిషనర్‌కు ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. తీరా 7వ తేదీన ప్రారంభోత్సం చేశారు. కేవలం 18 గంటల్లో అక్కడ రెస్టారెంట్‌ కొలువుదీరిన రహస్యం అటు బల్దియా, ఇటు నిర్వాహకులకు మాత్రమే తెలుసు.

ఈ విషయమై ‘సాక్షి’ బల్దియాలో అధికారులను వివరణ కోరగానే.. ఓ మాజీ విలేకరి అయిన ఓ మాజీ కార్పొరేటర్‌ రంగంలోకి దిగాడు. తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని వాదనకు దిగాడు. తీరా సాయంత్రానికి కమిషనర్‌ అనుమతులనే రద్దు చేశామని ప్రకటించడంతో చేసేది లేక తోకముడిచాడు. ఈ విషయమై వివరణ కోరేందుకు యత్నించగా సంబంధిత ఇంజినీర్లు ఫోన్లు స్విచాఫ్‌ చేసుకోవడం గమనార్హం. చివరకు బల్దియా కమిషనర్‌ అధికారికంగా రెస్టారెంట్‌ను మూసివేస్తామని ప్రకటించడంతో బల్దియా అధికారుల ఫోన్లు స్విచ్‌ఆన్‌ అయ్యాయి. బల్దియా అధికారుల అవినీతి, వారికి మామూళ్లు ఇచ్చి అక్రమాలకు పాల్పడుతున్న మాజీ కార్పొరేటర్ల ధనదాహానికి ఈ రెస్టారెంట్‌ చక్కటి ఉదాహరణ అని నగరవాసులు అభివర్ణిస్తున్నారు.

ఇదేం గలీజు దందా!1
1/2

ఇదేం గలీజు దందా!

ఇదేం గలీజు దందా!2
2/2

ఇదేం గలీజు దందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement