
‘రాజకీయ లబ్ధికే రాద్ధాంతం’
కరీంనగర్ కార్పొరేషన్: తమ రాజకీయ లబ్ధికే కొంతమంది వెలిచాల రాజేందర్‌రావు పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై వివాదం రేపుతున్నారని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పుడు మాటలు నమ్మరాదని సూచించారు. సోమవారం నగరంలో మాట్లాడుతూ.. రాజేందర్‌రావు అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలో ప్రొటోకాల్ పాటించలేదంటూ రాద్ధాంతం చేయడం ఉద్దేశపూర్వకమేనని విమర్శించారు. వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకునే ఫ్లెక్సీలో ప్రొటోకాల్ ఏంటని ప్రశ్నించారు. ఫ్లెక్సీలో కవ్వంపల్లి ఫొటో లేదంటూ దళితుల పేరిట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తమ ఇంట్లో దళితులతో కలిసి అప్పుడు జగపతిరావు, ఇప్పుడు రాజేందర్‌రావు సహఫంక్తి భోజనం చేస్తున్నారన్నారు. రాజేందర్‌రావుపై ఇదే వైఖరి కొనసాగిస్తే తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. నాయకులు అర్ష మల్లేశం, సుద్దాల లక్ష్మణ్, శ్రీనివా స్, శ్రీనివాస్, అజయ్, శంకర్ పాల్గొన్నారు.